05:52 PM, 3 Wednesday March 2021

అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత

– ఎటపాక పోలీసుల అదుపులో 4గురు నిందితులు
– 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
– మద్యం విలువ సుమారు రూ.52000/-లు

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రానున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఏజెన్సీలో మద్యం , నగదు రవాణాను కట్టడి చేసేందుకు ఎటపాక పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మండల పరిధిలోని లక్ష్మీపురం ప్రధాన కూడలిలో ఆదివారం సాయంత్రం ఎటపాక పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా దుమ్ముగూడెం మండలం చెరుపల్లి నుండి లక్ష్మీపురం వైపు 3 ద్విచక్ర వాహనాలపై అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని 4గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఎటపాక సీఐ గీతారామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం సరిహద్దుల్లో నుండి ఏజెన్సీ పరిధిలోకి జోరుగా అక్రమ తెలంగాణ మద్యం రవాణా జరుగుతున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో నిఘా ఏర్పాటు చేసి తెలంగాణ – ఆంధ్రా సరిహద్దుల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టామని , ఈ నేపథ్యంలో లక్ష్మీపురం ప్రధాన కూడలి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా 3 ద్విచక్ర వాహనాలపై రూ.17000/- విలువైన 100 మెక్డొవెల్ విస్కీ బాటిళ్లు , రూ.34800/- విలువ చేసే 580 ఓల్డ్ అడ్మిరల్ తెలంగాణ మద్యం బాటిళ్లను గుర్తించి 3 ద్విచక్ర వాహనాలతో సహా స్వాధీనం చేసుకున్నామని , మండలంలోని గన్నవరం , త్రిపురపెంటవీడు , గోగుబాక గ్రామాలకు చెందిన 4గురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రంపచోడవరం కోర్టులో హాజరుపర్చనున్నట్టు సీఐ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా ఆంధ్రాకు మద్యం తరలించినా , బెల్ట్ షాపులు నిర్వహించినా , కిరాణా దుకాణాల్లో అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎటపాక సీఐ గీతారామకృష్ణ హెచ్చరించారు. లక్ష్మీపురం వద్ద జరిగిన వాహన తనిఖీల్లో ఎస్సైలు జ్వాలాసాగర్ , చినబాబు మరియు ఎస్పీవో సిబ్బంది కొండలరావు , రమణ తదితరులు పాల్గొన్నారు.

 

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#