03:14 AM, 8 Monday March 2021

అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడేనా….?

అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడేనా….?
– ఇష్టారాజ్యంగా తెలంగాణాకు ఇసుక తరలింపు
– అనుమతి లేని ఇసుక ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు
–  రెవెన్యూ , పోలీసు అధికారుల ఆదేశాలు భేఖాతరు

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక  విధానాన్ని ఆసరా చేసుకుని కొందరు అక్రమార్కులు తమకు ఇష్టమొచ్చినట్లుగా అక్రమ ఇసుక దందాకు తెరలేపి కాసుల పంట పండించుకుంటున్నారు. అనుమతి లేని ఇసుక ర్యాంపుల నుండి రాత్రివేళ ఆంధ్రా , తెలంగాణా రాష్ట్రాలకు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల ఎటపాక మండల పరిధిలోని గుండాల ఇసుక ర్యాంపు మరియు ఎటపాక గోదావరి రేవులో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన అనధికార ఇసుక ర్యాంపు (ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ నుండి గ్రేస్ అనాధాశ్రమానికి వెళ్లే దారిలో) రాత్రిపూట అక్రమ ఇసుక రవాణాకు పూర్తి అడ్డాలుగా మారాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అయితే రాత్రిపూట సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కులకు బాగా కలిసొచ్చిందని మండలంలోని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. గతంలో గోగుబాక ఇసుక ర్యాంపు నుండి రెవెన్యూ , పోలీసు అధికారుల అనుమతితో కూపన్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులు వినియోగించుకునేలా వీలు కల్పించారు. తర్వాత కాలంలో గుండాల ఇసుక ర్యాంపు నుండి గృహవసరాలకు ఐటీడీఏ అధికారుల అనుమతితో ఇసుకను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయినా సరే ఇవేమి తమకు అవసరం లేదని , అక్రమార్కులు ఇసుక దందాకు తెరలేపారు. తెలంగాణా – భద్రాచలం సరిహద్దుకు అతి సమీపంలో గుండాల , ఎటపాక ఇసుక ర్యాంపులు ఉండటంతో ఇసుక మాఫియా యథేచ్ఛగా రాత్రి 9 గంటలు దాటిన తర్వాత తెల్లవారుజాము వరకు అక్రమంగా ఇసుక రవాణాను సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఎటపాక వద్ద గోదావరి రేవులో అనధికార ర్యాంపు చేసి ఓ వ్యవసాయ పొలంలో నుండి ఇసుకను తరలిస్తూ ఎవరికి అనుమానం రాకుండా తాత్కాలిక కంచెను ఏర్పాటు చేసి రాత్రి సమయంలో కరకట్ట మీదుగా భద్రాచలం పట్టణంలోని పలు కాలనీలకు ఇసుకను తరలించి అమ్ముకుంటున్నట్టు సమాచారం. సుమారుగా 3 నుండి 4 వేల రూ.ల వరకు ఒక ట్రాక్టర్ లోడుకు తీసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒకపక్క కరోనా ఎఫెక్ట్ కారణంగా గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల్లో అనేక భవన నిర్మాణాలు ఆగిపోయాయి. పనులు లేక భవన నిర్మాణరంగ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు ఇసుక అవసరమైన భవన యజమానులతో లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. గుండాల ఇసుక ర్యాంపులో రాత్రిపూట అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారాన్ని స్థానికులు మీడియాకు చేరవేయడంతో అక్కడికి వెళ్లగా ర్యాంపులో రాత్రిపూట ఇసుక తరలింపు దృశ్యాలు దర్శనమిచ్చాయి. మీడియాను చూడగానే అక్కడి నుండి సదరు వ్యక్తులు ట్రాక్టర్లతో సహా పరారయ్యారు. దీంతో ఏ స్థాయిలో మండలంలో రాత్రిపూట ఇసుక అక్రమ రవాణా జరుగుతుందో ఇట్టే అర్ధం అవుతుంది. ఇకనైనా మండల పరిధిలోని ర్యాంపుల్లో జరిగే ఇసుక అక్రమ రవాణాపై మండల స్థాయి అధికారులు , పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో దృష్టి సారించి మాఫియా పై తగు చర్యలు చేపట్టాలని మండల వాసులు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#