03:15 AM, 24 Sunday January 2021

అనంత వెంకట రెడ్డి ఆశయాలు కొనసాగిస్తాం

▪️ కరువు జిల్లాలో ఆయన సేవలు చిరస్మరణీయం
▪️ వైఎస్‌ఆర్‌కు స్ఫూర్తిగా నిలిచిన నేత ‘అనంత’
▪️ వైఎస్‌ అడుగుజాడల్లో సీఎం జగన్‌ పరిపాలన
▪️ జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా సాగుతాం
▪️ వర్ధంతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల స్పష్టీకరణ

అనంతపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జిల్లాలో కరువు నివారణకు అహర్నిశలు కృషి చేసిన దివంగత అనంత వెంకట రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. జిల్లాలో సాగునీటి పారుదల సౌకర్యాలు మెరుగుపర్చడంలో ఆయన పాత్ర కీలకమని అన్నారు. మంగళవారం అనంత వెంకట రెడ్డి 21వ వర్ధంతి సందర్భంగా అనంతపురం సర్వజనాస్పత్రి ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ప్రజల కష్టాలు తీర్చడానికి అనంత వెంకట రెడ్డి చేసిన కృషి ఎనలేనిదని, ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. నేటితరం రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శనీయులని కొనియాడారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి అన్ని పక్షాలను కలుపుకునిపోవడంలో సఫలీకృతులయ్యారని, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ ఒక వ్యక్తి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా పని చేయడమంటే సాధారణ విషయం కాదని, ప్రజల్లో అనంత వెంకట రెడ్డికి ఉన్న అభిమానంతోనే అది సాధ్యమైందన్నారు. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జైసల్మేర్‌కు వెళ్లి అధ్యయనం చేసి అనంతపురం జిల్లాలో కరువు నివారణకు కృషి చేశారని కొనియాడారు. రైతు పక్షపాతిగా నిలిచిన ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌తో కలిసి అనంత వెంకట రెడ్డి చేసిన కృషి వల్లే హంద్రీనీవా సాకారమైందన్నారు. ఇదే హంద్రీనీవా సామర్థ్యాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 6 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారని తెలిపారు. వివాదరహిత రాజకీయాలు చేయాలని తలచిన నాయకుడు అనంత వెంకట రెడ్డి అని కొనియాడారు. కరువు విలయతాండవం చేస్తున్న సమయంలో దాన్ని ఎలా అధిగమించాలో ఆలోచన చేసి అనేక పథకాలను జిల్లాకు తీసుకురావడంతో అనంత వెంకట రెడ్డి సఫలీకృతులయ్యారన్నారు. కృష్ణా జలాల కోసం జరిగిన ఉద్యమాల్లో చురుకైన పాత్ర వహించారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నేటితరం రాజకీయ నేతలకు అనంత వెంకట రెడ్డి ఆదర్శనీయులన్నారు. కరువు జిల్లాలో ఈ మేరకైనా సాగునీటి పారుదల సౌకర్యాలు మెరుగయ్యాయంటే అనంత వెంకట రెడ్డి, వీకే ఆదినారాయణ, సదాశివన్‌ వంటి నేతల ఫలితమేనని అన్నారు. గత ప్రభుత్వం హంద్రీనీవా పథకానికి అనంత వెంకట రెడ్డి పేరు తొలగించడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

కలిసికట్టుగా అభివృద్ధి సాధిస్తాం : అనంత

జిల్లాలో ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా అభివృద్ధి సాధిస్తామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. రాజకీయాల్లో కక్షసాధింపు, ఫ్యాక్షనిజం వంటి వాటికి తన తండ్రి అనంత వెంకట రెడ్డి దూరంగా ఉన్నారని, ఆయన బాటలోనే తాను పయనిస్తున్నట్లు చెప్పారు. కరువు పీడిత ప్రాంతానికి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకురావడానికి అప్పట్లో గంగాధర్, అనంత వెంకట రెడ్డి వంటి వారు కృషి చేశారని గుర్తు చేశారు. జిల్లాలో ఎడారి పరిస్థితులు కనిపిస్తున్న సమయంలో సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి డీడీపీ (డ్రాఫ్ట్‌ ప్రోన్‌ ఏరియా ప్రోగ్రాం) పథకం తీసుకొచ్చారని తెలిపారు. అనంత వెంకట రెడ్డి చేసిన పోరాటాలు, కృషిని గుర్తించే వైఎస్‌ రాజశేఖరరెడ్డి హంద్రీనీవాకు అనంత వెంకట రెడ్డి పేరు పెట్టారని, కానీ గత ప్రభుత్వం ఆ పేరును తొలగించిందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక పేరు పునరుద్ధరించడమే కాకుండా ఒక అడుగు ముందుకేసి జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. కృష్ణా జలాలను ఎక్కువగా తీసుకురావడం కోసం హంద్రీనీవా సామర్థాన్ని 6 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు మరో సమాంతర కాలువను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యుల నివాళి

బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఉన్న అనంత వెంకట రెడ్డి ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. ఘాట్‌ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. కార్యక్రమంలో అనంత వెంకట రామిరెడ్డి, అనంత సుబ్బారెడ్డి, అనంత చంద్రారెడ్డి, అనంత మీనా, మాలతి, సువర్ణ, వై.శివరామిరెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, భీమిరెడ్డి, అనంత నవ్యత, గంగుల వికాస్ రెడ్డి, అనంత లిఖిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఘాట్‌ వద్దకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, అభిమానులు చేరుకుని నివాళి అర్పించారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#