– సీఎం పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారు
– తిమ్మాపురం లో ఇళ్ల పట్టాల పంపిణీ
– మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత
కాకినాడ రూరల్, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
గతంలో ఇళ్లు ఇచ్చిన ముఖ్యమంత్రిని చూశాంగానీ.. ఊళ్లకు ఊళ్లను కట్టిస్తున్న ముఖ్యమంత్రిని వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపంలో ప్రస్తుతం చూస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్‌ప్రాసెసింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ గ్రామీణ మండలంలోని తిమ్మాపురంలో 50 ఎకరాల 30 సెంట్ల విస్తీర్ణంలో 1919 మంది లబ్ధిదారులకు నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎంపీ వంగా గీతా, జేసీ (ఆర్) డా. జి లక్ష్మీశ తదితరులతో కలిసి మంత్రి కన్నబాబు ప్రారంభించారు. రూ.36.65 కోట్ల అంచనా విలువతో చేపట్టే గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ఓ యజ్ఞంలా చేపడుతున్నారని వివరించారు. ప్రస్తుతం తిమ్మాపురం లేఅవుట్లో హైవేకు సమీపంలో దాదాపు రూ.15 లక్షల విలువైన ఆస్తిని అక్కాచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నామన్నారు. ఇళ్ల స్థలాలను పూర్తి హక్కులతో మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, అయితే దీన్నికొందరు అడ్డుకుంటూ కోర్టులో కేసులు వేశారన్నారు. జాప్యం జరగకూడదన్న ఉద్దేశంలో ప్రస్తుతం ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తోందని, కోర్టులో సానుకూల తీర్పువెలువడ్డాక రిజిస్ట్రేషన్ చేయిస్తామని వివరించారు. కులమత భేదాల్లేకుండా అందరూ ఒకేచోట కలిసి ఉండాలనే ఉద్దేశంతో అన్నిమౌలిక వసతులతో వైఎస్సార్ జగనన్న కాలనీలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఏ పథకం కోసమూ ఎవరి ముందూ చేయి చాచాల్సిన అవసరం లేకుండా ప్రతి లబ్ధిదారుడికీ సంక్షేమ ఫథకాలు అందించేందుకు వలంటీర్, సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి, ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారన్నారు. కాకినాడ గ్రామీణ మండలంలో 18,713 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు. దళారుల వలలో పడకుండా చూసుకోవాలని, ఎవరికీ ఇళ్లను అమ్మొద్దన్ని మంత్రి సూచించారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హులు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో పట్టా అందుతుందన్నారు. పేదలకు ఇళ్ల పథకానికి భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
– పేద ప్రజలకు నిజమైన నీడ కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకాన్ని అమలుచేస్తున్నారని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ పేర్కొన్నారు. ప్రతి సంక్షేమ పథకం ఫలాలను చివరి లబ్ధిదారుని వరకు చేర్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు వారసుడిగా రాష్ట్ర వ్యాప్తంగా గృహం లేని 30.75 లక్షల గృహిణుల సొంతింటి కలను సాకారం చేస్తున్నారన్నారు. జిల్లాలో మూడు వేల కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు 5,500 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ తెలిపారు. స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని వివరాలతో కూడిన పట్టాలను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు వివరించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అందుబాటులో ఉంచిన మూడు ఆప్షన్లను జేసీ.. లబ్ధిదారులకు వివరించారు. కార్యక్రమంలో కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కురసాల సత్యనారాయణ, ఏఎంసీ ఛైర్మన్ గీసాల శ్రీను, కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ, ఎంపీడీవో పి.నారాయణమూర్తి, తహసీల్దారు మురళీకృష్ణ, బెజవాడ సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు హాజరయ్యారు.