– పార్టీ పదవులకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి లు రాజీనామా..
కాకినాడ రూరల్, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త, బీసీ నాయకుడు పిల్లి సత్యనారాయణ మూర్తి తెలుగుదేశం పార్టీ పదవులకు రాజీనామా చేశారు. వాకలపూడి లోని వారి స్వగృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు తమకు సహకరించిన కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు, నాయకులకు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల చోటుచేసుకున్న కుటుంబ పరిస్థితుల దృష్ట్యా, వ్యక్తిగత పరిస్థితుల వలన పార్టీ కాకినాడ రూరల్ ఇన్చార్జి పదవికి మరియు కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయడం జరిగిందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక సభ్యత్వం ఎప్పుడూ అలానే ఉంటుందని తమ అవసరం పార్టీకి ఏ రూపంలో వచ్చినా సహాయసహకారాలు పార్టీకి అందిస్తామని, మాచివరి రక్తపు బొట్టు వరకు తెలుగుదేశం పార్టీ కోసం పాటుపడతామన్నారు.
కేవలం పార్టీ పదవులకు మాత్రమే రాజీనామాలు చేయడం జరిగిందని పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి కంటతడి పెట్టారు. ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ స్థానిక సంస్థలు ఎన్నికలు జరపడం సంతోషదాయకమని పేర్కొంటూ, గతంలో అధికార పార్టీ ప్రతిపక్షాలను గౌరవించేదని గుర్తు చేశారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అయ్యేవని నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ఏ పార్టీ అభ్యర్థి గెలిచిన అధికార పార్టీవైపు మొగ్గు చూపడం సర్వసాధారణమని, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా వుండేదన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి లేదన్నారు. టీడీపీని, కార్యకర్తలను అంటరాని వారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. టిడిపి అభ్యర్థులపై అనేకరకాల వత్తిళ్ళు, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. వైసీపీ బెదిరింపులు, దౌర్జన్యాలు లేకపోతే తెదేపా అభ్యర్థులు గెలుపు సాధ్యమేనని అన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేకపోతే రాష్ట్రంలో అన్ని పంచాయతీలను వైసీపీ ప్రభుత్వం ఏకగ్రీవాలు చేసేదన్నారు. తమ కుటుంబం నిందా రాజకీయాలకు దూరమని, మంత్రిగా కన్నబాబు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఇకపై కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తామని అన్నారు. ఇన్నాళ్లూ తమను ఆదరించినందుకు ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ కంటతడి పెట్టుకున్నారు.