10:06 AM, 16 Saturday January 2021

ఇళ్ల పట్టాలు పంపిణీ నిరంతర ప్రక్రియ

– అర్హులు లు దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోనే ఇంటి స్థలం మంజూరు
– జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే లు జ్యోతి ప్రజ్వలనతో ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రారంభించారు
– జిల్లాలో 3.80 లక్షలు ఇళ్ల పట్టాల మంజూరుకు గాను 45 వేలు కోర్టు కేసు పరిధిలో ఉన్నాయి

ప్రత్తిపాడు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జిల్లాలో 3 లక్షల 80 వేల మందికి  ఇంటి స్థల పట్టాలను పేదలందరికీ ఇళ్ల లో భాగంగా లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ప్రత్తిపాడు మండలం ఉత్తరఖంచి గ్రామంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పట్టాల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3 లక్షల80 వేల ఇళ్ల పట్టాల మంజూరుకు గాను 45 వేలు కోర్టు కేసు పరిధిలో ఉన్నాయని అన్నారు. అందరికీ ఇళ్ల పట్టాలు పొందిన లబ్దిదారులకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఒక లక్ష 80 వేల రూపాయలను 3 ఆప్షన్ల ద్వారా అందజేస్తున్నదని అన్నారు. ఇప్పటికే ఒక లక్ష50 వేల ఇళ్ల నిర్మాణానికి మొదటి విడతగా మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. కాలనీల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జిల్లాకు రూ. 64 కోట్లను మంచినీటి బోర్లకు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ లకు పేదల  ఇళ్ల నిర్మాణం లో నాణ్యత లో రాజీ పడకూడదని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అందరికీ ఇళ్ళ పథకంలో అమలు చేస్తున్న ప్రక్రియ గతం కంటే భిన్నంగా రిజిస్ట్రేషన్, లబ్దిదారులకు వారి కేటాయించిన లే అవుట్ లోనే  జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంపిణీ చేసే స్థలంలోనే పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారని తెలిపారు. కొంతమంది కావాలనే పథకాలపై అసత్య ప్రచారాలు నిర్వహిస్తున్నారని అటువంటి ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని తెలిపారు. పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేశారని, ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వంగా గీతా విశ్వనాధ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. నవరత్నాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలందరికీ ఇళ్ళు పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇళ్లు లేని ఆడపడుచుల ఇబ్బందులు చూసి వారి కష్టాలు తీర్చడానికి పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతీ ఆడపడుచు ఈ స్థలాన్ని తమ సొంత ఆస్థిగా భావించి ఆస్తిని అమ్ముకోవద్దని కోరారు. ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ నియోజకవర్గంలో 22 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.  పార్టీలు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్లు లేని నిరుపేదలకు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారని, కానీ అంతకుమించి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని అన్నారు. కులాల పరంగా చేతి వృత్తులు చేసుకునే ప్రతీ ఒక్కరికీ ఆర్థిక సహకారం అందించడం జరుగుతుందని అన్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పింఛన్లు ఇంటి వద్దకే వచ్చి అందజేస్తున్న ఘనత ప్రభుత్వానిదని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలులో ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించి ముఖ్యమంత్రికి అండగా ఉండాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం అనంతరం పెద్దిపాలెం, ఉత్తరఖంచి, ఈ గోకవరం, రౌతుపాలెం గ్రామాలకు సంబంధించిన 719 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను కలెక్టర్, ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందు జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇళ్ల పట్టాల పంపిణీ పై  ముఖ్యమంత్రి సందేశాన్ని సభలో చదివి వినిపించారు. ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో లబ్దిదారులు ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, ఎమ్మెల్యే ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ గోపాలకృష్ణ, ఎంపిడివో శ్రీలలిత, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#