ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు
– ఎటపాక తహశీల్దార్ సి.హెచ్.వెంకటేశ్వర్లు
ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండల పరిధిలోని గుండాల మరియు అనధికార ఎటపాక ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎటపాక తహశీల్దార్ సి.హెచ్.వెంకటేశ్వర్లును విశ్వం వాయిస్ ప్రతినిధి వివరణ కోరగా తహశీల్దార్ వివరణ ఇచ్చారు. మండల పరిధిలో పగటిపూట మాత్రమే రైత్వారి పనుల నిమిత్తం మిర్చి కల్లాల్లోకి ఇసుక రవాణాకు అనుమతి ఇచ్చామని , అంతేకాని ఎవరైనా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇసుకను అక్రమంగా ర్యాంపుల నుండి గృహవసరాలకు తరలించినా , రాత్రిపూట అక్రమ రవాణాకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు. అంతరాష్ట్రాల సరిహద్దుల్లో ఇసుక ర్యాంపులు ఉండటంతో రాత్రిపూట అక్రమంగా తరలిస్తున్నట్టు తమకు వార్తలు అందాయని , దీనిపై రాత్రిపూట నిఘా బృందాలను ఏర్పాటు చేసి అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు.