శ్రీకాకుళం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
జిల్లాలో పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళిని పక్కాగా అమలుచేయాలని తహశీల్ధారులకు, ఎస్.హెచ్.ఓలకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ దిశా నిర్ధేశం చేసారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లాలోని తహశీల్ధారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ల ( ఎస్.హెచ్.ఓ) శిక్షణ కార్యక్రమం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున ఎన్నికల నియామవళిని పక్కాగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. పోటీచేసే అభ్యర్ధులు కావాలని తప్పులు చేయబోరని, అవగాహన రాహిత్యం వలన తప్పులు చేసే అవకాశం ఉందని, కావున పోటీచేసే అభ్యర్ధులకు ఎన్నికల నియమావళిపై క్షుణ్ణంగా తెలియజేయాలని కలెక్టర్ స్పష్టం చేసారు. అభ్యర్ధులు ప్రచారం కొరకు వినియోగించే వాహనాలు, కరపత్రాలు, గోడపత్రికలు, సోషల్ మీడియా తదితరాలకై ఖర్చుచేసిన ప్రతీ పైసాను సంబంధిత రిజిష్టరులో నమోదయ్యేలా అవగాహన కల్పించాలని చెప్పారు. 10వేలకు పైబడి జనాభా కలిగిన గ్రామాల్లోని సర్పంచ్ కొరకు పోటీచేసే అభ్యర్ధి రూ.2.50లక్షలు, వార్డు మెంబరైతే రూ.50వేలు, 10వేలు లోపుగల జనాభా కలిగిన గ్రామాల్లో సర్పంచ్ కొరకు రూ.1.50లక్షలు, వార్డు మెంబరైతే రూ.30వేల వరకు ఖర్చుచేసే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. కాబట్టి అందుకు తగిన విధంగా అభ్యర్ధుల ఖర్చు వివరాలు నమోదయ్యేలా చూడాలని చెప్పారు. అభ్యర్ధులు ప్రభుత్వ ఆస్తులపై ఎటువంటి ప్రచారాలు చేసేందుకు అవకాశం లేదని, ప్రైవేటు బిల్డింగులపై ప్రచారం చేసే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత ఇంటి యజమాని అనుమతి, రిటర్నింగ్ అధికారుల ఆమోదం మేరకు మాత్రమే ప్రచారం చేసుకోవచ్చని, అయితే వీటి లెక్కలు చూపించాలని స్పష్టం చేసారు. ప్రచారానికి వినియోగించే గోడపత్రికలు, కరపత్రాలు తదితరాలకు సంబంధించి సంబంధిత ప్రింటర్స్ పేరు, మొబైల్ నెంబరుతో పాటు ప్రతుల సంఖ్య ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉందని చెప్పారు. అభ్యర్ధులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా ఎటువంటివి పంపిణీచేయరాదని వివరించారు. అభ్యర్ధులు బహిరంగ సభలు ఏర్పాటుచేసుకునేందుకు పోలీసుల నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి అని, అదేవిధంగా అభ్యర్ధులు వినియోగించే వాహనాలకు కూడా అనుమతి తప్పనిసరి కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలుచేయాల్సిందేనని, ఇందులో ఎటువంటి సందేహాలకు తావివ్వద్దని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్ మాట్లాడుతూ పోలీసు అధికారులు నిర్వర్తించవలసిన విధుల గురించి వివరించారు. జిల్లా కలెక్టర్ తెలిపిన ప్రతీ విషయాన్ని తూ.చ పాటించాలని, ఎన్నికల నియమావళిని పక్కాగా అమలుచేయాలని అన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, ఎన్నికల శిక్షణ అధికారి పి.రజనీకాంతారావు, శిక్షణా తరగతుల సమన్వయ అధికారి బి.శాంతి, ప్రత్యేక ఉప కలెక్టర్లు యం.అప్పారావు, సీతారామయ్య, తహశీల్ధారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.