11:22 PM, 3 Wednesday March 2021

ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలి.. సంక్షేమ పథకాలు అమలు చేయాలి

– కలెక్టరేట్ వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు…
– అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఐసిడిఎస్ కు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లో నిధులు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అంగన్వాడీ లకు వర్తింప చేయాలని తదితర డిమాండ్లతో బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేలాదిమంది అంగన్వాడీ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కదం తొక్కారు. ఈ సందర్భంగా అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలంటూ పలు డిమాండ్ లపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె‌. కృష్ణ వేణి అధ్యక్షత వహించారు. సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఎవి నాగేశ్వరరావు ఈ ఆందోళన లో పాల్గొని ప్రసంగించారు. తల్లిబిడ్డల సంరక్షణ లో ఐసిడిఎస్ ఎనలేని పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కృషిలో అంగన్వాడీ లో పాత్ర గర్వించే విధంగా ఉందన్నారు. కరోనా సమయం లో కూడా ఎన్నో వ్యయప్రయాసలు తట్టుకుని అంగన్వాడీ లు విధులు నిర్వహించారని కొనియాడారు. రూ.11,500 జీతం ఇస్తూ అమ్మ ఒడి గాని, ఇండ్ల స్థలం గాని రాదని చెప్పడం దారుణమన్నారు. గత చాలా కాలంగా అంగన్వాడీ లకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ జి.ఓ.నెం. 7 ఉందనే విషయాన్ని నేటి పాలకులు గుర్తించాలన్నారు. ఉద్యమాల వేగుచుక్క అంగన్వాడీ ఉద్యమమని, అంగన్వాడీ డిమాండ్ ల సాధనకు సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ లకు అప్పగించే 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, కేంద్ర విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నామన్నారు. కరోనా సమయం లో కూడా అంబానీల ఆస్తులు భారీగా పెరిగాయని, సామాన్యులు, వలస కార్మికులు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో ఐసిడిఎస్ కు నిధులు పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి‌. బేబి రాణి మాట్లాడుతూ అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా దూరం చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించి తగిన వేతనాలు చెల్లిస్తే ప్రభుత్వ పథకాలు ఇవ్వకపోయినా పరవాలేదన్నారు. మినీ వర్కర్స్ కు కూడా సాధారణ వర్కర్ వలే వేతనాలు, ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంగన్వాడీ సెంటర్ లకు నాణ్యమైన ఫీడింగ్ సరఫరా చేయాలని, అదీ కూడా సెంటర్ కు అందించే ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయ మహిళా పోలీసుల వేధింపులు అంగన్వాడీ లపై ఎక్కువగా ఉన్నాయని, తీరు మారకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. అంగన్వాడీ ప్రమోషన్లలో గ్రామం, మున్సిపాలిటీ యూనిట్ గా తీసుకోవాలన్నారు. రిటైర్ అయిన అంగన్వాడీ లకు రూ. 3 లక్షలు అందించాలని, నాటి వేతనం లో సగం పెన్షన్ గా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈరోజు ఆందోళన ప్రారంభం మాత్రమే అని, సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఐసిడిఎస్ ఎపిడి….డి. విజయలక్ష్మి,  సూపరింటెండెంట్ ఎం.రమణి, సీనియర్ అసిస్టెంట్ ఎ. విమల తదితరులు హాజరై అంగన్వాడీ సమస్యలపై యూనియన్ సమర్పించిన వ్రాతపూర్వక వినతి పత్రం తీసుకుని సమాధానం చెప్పారు. ప్రాజెక్టు ల వారీగా సమస్యలు పరిష్కారానికి జాయింట్ మీటింగ్ లు నిర్వహించాలని యూనియన్ నాయకులు కోరారు‌. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్షురాలు బి. ప్రభావతి సంఘీభావం ప్రకటిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ. చంద్రావతి, కోశాధికారి దడాల పద్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలక వెంకట రమణ, నాయకులు నూకల బలరాం, నక్కిళ్ళ శ్రీనివాస్, షేక్ పద్మ, నిర్మల, దాడి బేబి, మార్త, కృష్ణ కుమారి, రాజేశ్వరి, ఫాతిమా, దుర్గ,  వరలక్ష్మి, బుల్లెమ్మ, రాణి, రామలక్ష్మి, ఆదిలక్ష్మి, రాణి, బేబి, వెంకటలక్ష్మి, సుజాత, బేబి గంగారత్నం, వసుధ, మేరీ సమాధానం, రమణమ్మ, సిఐటియు నగర నాయకులు మేడిశెట్టి వెంకట రమణ, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#