కల్వర్టుల వద్ద పోలీసుల విస్తృత తనిఖీలు
– ఎటపాక ఎస్సై జ్వాలాసాగర్ ఆధ్వర్యంలో
ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
ఈ నెల 17న జరగనున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎటపాక పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగా జిల్లా ఎస్పీ నయిం అస్మి మరియు చింతూరు డిఎస్పీ ఎస్.కె.ఖాదర్ బాషా ఆదేశాల మేరకు ఎటపాక సీఐ గీతారామకృష్ణ పర్యవేక్షణలో ఎస్సై జ్వాలాసాగర్ ఆధ్వర్యంలో సి/39 సీఆర్పీఎఫ్ బెటాలియన్ సిబ్బందితో మండల పరిధిలోని సమస్యాత్మక , మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన విస్సాపురం నుండి గౌరిదేవిపేట వరకు ఎటపాక పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. విస్సాపురం నుండి గౌరిదేవిపేట వరకు గల కల్వర్టుల వద్ద బాంబు స్క్వాడ్ సిబ్బందితో మెటల్ డిటెక్టర్ తో పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల దృష్ట్యా పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని సీఐ గీతారామకృష్ణ తెలిపారు. ఎన్నికల సమయంలో ఎవరైనా అల్లర్లు , అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా , ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్టు తెలిసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఓటర్లు మద్యం , నగదు వంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సూచించారు. నాటుసారా , గంజాయి వంటి మత్తుపదార్దాలను రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ , ఎస్సైలు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సి/39 సీఆర్పీఎఫ్ బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.