– 217 పరిశోధనల్లో ఉత్తమ పరిశోధనగా ఎంపిక
చల్లపల్లి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
ప్రపంచాన్ని వణించిన కొవిడ్-19పై పరిశోధనాపత్రం సమర్పించిన చల్లపల్లి మండలం నిమ్మగడ్డ గ్రామానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మోడింపూడి శ్రీకాంత్-డాక్టర్ సునీత దంపతుల కుమార్తె ఎం. లక్లిన్ ప్రతిష్టాత్మక బంగారు పతకం అందుకుని సత్తా చాటారు. పరిశోధనారంగం విశిష్టతను, ఔన్నత్యాన్ని తెలియజేస్తూ విద్యార్థి దశ నుంచే యువతను సాంకేతిక పరిశోధనల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ప్రముఖ విద్యాసంస్థ ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీ నిర్వహించే రీసెర్చ్ డే పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని శనివారం అమరావతిలోని ఎస్.ఆర్ఎం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించారు.
విశ్వవిద్యాలయం వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 217 మంది అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు అత్యంత ప్రామాణికంగా పరిగణించే ఈ రీసెర్చ్ డే పతకాలకు తమ పరిశోధనలను సమర్పించారు. విద్యార్థుల హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగంలో లక్లిన్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరంలోనే ఈ బంగారు పతతాన్ని చేజిక్కించుకుని ప్రత్యేకతను చాటారు.
‘ఆన్ లైన్ ఫార్మసీలు, జనరిక్ ఔషధాల పట్ల వినియోగదారుల అవగాహన, కొనుగోలు శైలిపై కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం’ అంశంపై తన పరిశోధనా ఫలితాలను ప్రదర్శించడంతో అత్యుత్తమ పరిశోధనగా ఎంపిక కావడంతో విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్. సోమనాథ్ వర్చ్యువల్ లో ఎస్.ఆర్.ఎం.యూనివర్సిటీ ప్రొవైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి. నారాయణరావు, డీన్.. ఎకడమిక్ ఎఫైర్స్ బి. శివకుమార్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్‌ను లక్లీన్ అందుకున్నారు. కొనిడ్-19 మహమ్మారిపై ఎం. లక్లిన్, సహా పరిశోధకులు డాక్టర్ ఏ. లక్ష్మణరావుల పరిశోధనలు ప్రజలు, సాంకేతిక నిపుణులు, పరిశ్రమలకు దిక్సూచిగా ఉంటాయని వైద్యులు, పలువురు ప్రముఖులు ప్రశంసించారు.