ఆత్రేయపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ పట్ల అపోహలు, భయాందోళనలను విడనాడి, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అందరూ వ్యాక్సిన్ వేయించు కోవాలని తహశీల్దార్ ఎం రామకృష్ణ అన్నారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కేంద్రం ఆత్రేయపురం పి హెచ్ సి వైద్యులు డా.శ్రీనివాసవర్మ ఆద్వర్యంలో ఆయన కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాధిని సమూలంగా నిరోధించే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ ను గత నెల 16 తేదీ నుండి ఉచితంగా అందుబాటులోకి తెచ్చాయన్నారు. రెండొవ దశగా మండలంలో కోవిడ్-19 నియంత్రణలో ముందు వరుస యోధులుగా పనిచేస్తున్న రెవెన్యూ,పంచాయితీ రాజ్, గ్రామ వలంటిర్లు సిబ్బంది వ్యాక్సినేషన్ చేపట్టి ఇప్పటి వరకూ అత్యధిక సంఖ్యలో ఈ టీకాలు మండలం లో వేయడం జరిగిందన్నారు. తొలిదశలో వైద్య సిబ్బంది కి టీకాలు వేయడం జరిగిందన్నారు. సమగ్రమైన పరీక్షల ద్వారా అత్యంత సురక్షితమైనదిగా కోవిడ్-19 వ్యాక్సిన్ నిరూపితమైందని, వ్యాక్సిన్ కారణంగా ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని డా.శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వల్ల చాలా అరుదుగా అతి తక్కవ మందిలో దద్దుర్లు, తేలికపాటి జ్వరం, తలత్రిప్పు కలిగినా, ఏమాత్రం ప్రమాదం కాదని, వ్యాక్సిన్ వేసిన ప్రతి ఒక్కరినీ అరగంట పాటు వైద్య పరిశీలనలో ఉంచుతారని, ఏవిధమైన దుష్పరిణామాలు ఎదురైనా వెంటనే తక్షణ వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేక వార్డులు, వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ పట్ల ఇంకా ప్రజలలో కొనసాగుతున్న సందేహాలు, సంకోచాలను పటాపంచలు చేసేందుకు, నిర్బయంగా వ్యాక్సిన్ వేయించుకునేలా చైతన్య పరచేందుకు స్వయంగా తానూ టీక వేయించుకున్నామన్నారు. ఏవిదమైన అస్వస్థతగాని, అసౌకర్యం గానీ కలగలేదని,. దశల వారిగా ప్రజలందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ ను పంపిణీ చేయడం జరుగుతుందని, సురక్షితమైన, క్షేమకరమైన ఈ వ్యాక్సిన్ ను నిర్బయంగా, నిస్సంకోచంగా వేయించుకోవాలని కోరారు. తహశీల్దార్ తో పాటు,వీఆర్వోలు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు.