◘ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై అధికారులతో సమీక్ష
– కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి
కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని కోర్టుహాల్లో ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, రాజమహేంద్రవరం ఎస్పీ షేముషి బాజ్‌పాయ్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తదితరులతో కలిసి అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని పోలీసు, రెవెన్యూ అధికారులకు సూచించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పటిష్ట ప్రణాళికతో అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి వివిధ పనుల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్‌రూంను ఏర్పాటు చేస్తున్నామని.. ఫిర్యాదులను సత్వరం పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కంట్రోల్ రూం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి బాధ్యతలను బీసీ కార్పొరేషన్ ఈడీకి అప్పగించినట్లు వెల్లడించారు. మైక్రో అబ్జర్వర్స్, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ అంశాలను డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ చూస్తారన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందించే బాధ్యతను జిల్లా పంచాయతీ అధికారికి అప్పగించినట్లు వివరించారు. బ్యాలెట్ పెట్టెల నిర్వహణ బాధ్యతలను జెడ్పీ సీఈవోకు, ఎన్నికల వ్యయం అంశాల బాధ్యతను జిల్లా ఆడిట్ అధికారికి కేటాయించినట్లు వివరించారు. సిబ్బంది శిక్షణ అంశాల బాధ్యతను మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌కు అప్పగించామన్నారు. డీపీవో, సీపీవో కార్యాలయాల సిబ్బందికి బ్యాలెట్ పేపర్ల బాధ్యతలను అప్పగించామన్నారు. డీఈవో, డీఐవో, డీటీవో, డీఎల్డీవోలు తదితర అధికారులకు కూడా ప్రత్యేక విధులు కేటాయించినట్లు తెలిపారు. ఇలా ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా దశల వారీగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీసీ
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వెలగపూడి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, రాజమండ్రి అర్బన్ ఎస్పి షేమూషి బాజ్ పాయ్, జేసీ (డీ)కీర్తి చేకూరి తదితరులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సన్నద్ధత పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్.. ఎస్ఈసీకి తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. ఓ వైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు.. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియకు ఆటంకం లేకుండా చూసేందుకు సిబ్బందిని మోహరిస్తామని పేర్కొన్నారు.
సమావేశంలో అడిషనల్ ఎస్పి కరణం కుమార్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, జెడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ, డీపీవో ఎస్వీ నాగేశ్వర్‌నాయక్, డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాథ్, మెప్మా పీడీ కె.శ్రీరమణి, కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ, పెద్దాపురం ఆర్డీవో ఎస్.మల్లిబాబు , సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు.