04:33 PM, 3 Wednesday March 2021

డ్రైవర్ల సేవలు శ్లాఘనీయం

శ్రీకాకుళం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

కోవిడ్ సమయంలో వలస కార్మికులను జిల్లాకు రప్పించడంలో పి.పి.ఇ కిట్లు వేసుకొని ఆర్.టి.సి డ్రైవర్లు అందించిన సేవలు శ్లాఘనీయమని జిల్లా కలెక్టర్ జె.నివాస్ కొనియాడారు. 32వ రహదారి భద్రతా మరియు ఇంధన పొదుపు మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీకాకుళం ఆర్.టి.సి.కాంప్లెక్స్ లోని 2వ డిపోలో ఉత్తమ డ్రైవర్ల అభినందన సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు నడిచివచ్చే వారిని గమనించడం జరిగిందని, అటువంటి వారిని జిల్లాలకు రప్పించేందుకు  దేశంలోనే ప్రప్రధమంగా జిల్లా నుండి ఆర్.టి.సి బస్సులను పంపి వలస కార్మికులను తరలించామని ఆ సమయంలో  ఆర్.టి.సి డ్రైవర్లు పి.పి.ఇ కిట్లు వేసుకొని అందించిన సేవలు శ్లాఘనీయమని పేర్కొన్నారు. దేశంలోనే బస్సులను పంపి వలస కార్మికులను వారి ప్రాంతాలకు పంపే జిల్లాల్లో ప్రపథమ జిల్లా  శ్రీకాకుళం కాగా, బస్సులను పంపి వలస కార్మికులను తెప్పించే రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని, ఇది నిజంగా గర్వకారణం అని కలెక్టర్ కొనియాడారు.  వలస కార్మికుల కోసం మన జిల్లాలో చేపట్టిన ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా అమలైందని, ఇది  శుభపరిణామమని తెలిపారు. వలస కార్మికులను స్వగ్రామాలకు చేర్చడంలో సహాయపడిన ఆర్.టి.సి డ్రైవర్లకు వారి ఆశీస్సులు ఉంటాయని కలెక్టర్ కితాబిచ్చారు.

దేశంలో ప్రతీ 4 నిమిషాలకు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని, ఏడాదికి సుమారు 50 లక్షల మంది వివిధ ప్రమాదాలకు గురవుతున్నారని, ఇందులో 1 లక్షా 50 వేల మంది మరణిస్తున్నారని, యుద్ధంలో మరణించిన వారి సంఖ్య కంటే ఇది అధికమని కలెక్టర్ గుర్తుచేసారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ మాసం సుమారు 1200 మంది వరకు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, ఇందులో 370 మంది వరకు మృతి చెందుతున్నారని కలెక్టర్ చెప్పారు. ఒక చిన్న ప్రమాదం వలన తమతో పాటు తమ కుటుంబం కూడా రోడ్డున పడుతుందనే విషయాన్ని డ్రైవర్లు గుర్తించుకోవాలని అన్నారు. దేశంలో అతితక్కువ ప్రమాదాలు కలిగిన వాటిలో ఆర్.టి.సి ముందంజలో ఉండటం ముదావహమని అన్నారు.

జాతీయ రహదారి విస్తీర్ణత ఎక్కువ కలిగిన ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లా ఉందని, రహదారి ప్రమాదాల్లో గతేడాదితో పోలిస్తే ఆ సంఖ్య తగ్గినప్పటికీ జీరో స్థాయి ప్రమాదాలకు జిల్లా చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.

డ్రైవర్లు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, అందుకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని కోరారు. ప్రతీ రోజూ అర్ధగంట సేపు వ్యాయామం చేయడం వలన మరింత ఉత్సాహంగా పనిచేస్తారని, దానివలన ఎటువంటి ప్రమాదాలు జరగబోవలని ఆకాంక్షించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన విజయనగరం డిపోకు చెందిన బి.ఎ.రావు, ఎన్.ఎస్.ఎం.రాజు, శ్రీకాకుళం 1వ డిపోకు చెందిన కె.రాజారావు, 2వ డిపోకు చెందిన బి.వి.యస్.నారాయణ, ఎం.సి.హెచ్.రావు, యస్.కోట డిపోకు చెందిన ఎ.ఎస్.నారాయణ, డి.పి.రాజులకు కలెక్టర్ బహుమతులను అందించి అభినందించారు.

ఉప రవాణా కమీషనర్ డా.వడ్డి సుందర్ మాట్లాడుతూ మిగిలిన డ్రైవర్లతో పోలిస్తే ఆర్.టి.సి డ్రైవర్లు వలన జరిగే ప్రమాదాల శాతం తక్కువేనని ఇది శుభపరిణామమని అన్నారు. రహదారి భద్రతా నియమాలను తూ.చ పాటించడంలో ఆర్.టి.సి ముందంజలో ఉంటుందని చెప్పారు. ఆర్.టి.సి డ్రైవర్లు చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తారని కొనియాడారు. కోవిడ్ సమయంలో పి.పి.ఇ కిట్లు వేసుకొని వలస కార్మికులను తీసుకురావడంలో డ్రైవర్లు అందించిన సేవలు అమోఘమని, డ్రైవర్లను చూసి చాలా మంది చైతన్యం పొందారని అన్నారు. ఇదేస్పూర్తితో మున్ముందు కూడా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రాంతీయ మేనేజర్ ఎ.అప్పలరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం  డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.వరలక్ష్మీ, కె.శ్రీనివాసరావు, బి.పి.సి.ఎల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, శ్రీకాకుళం 1,2 డిపో మేనేజర్లు బి.ప్రవీణ, కవిత, ప్రజా సంబంధాల అధికారి బి.యల్.పి.రావు, 9 డిపోలకు చెందిన మేనేజర్లు, రీజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్, పర్సనల్ ఆఫీసర్స్, డైవర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#