రైతన్నలకు తీరనున్న కరెంటు కష్టాలు
– వైకాపా నాయకులు రంభాల.నాగేశ్వరరావు చొరవతో
ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీ బూరుగువాయి తండాలో రైతులకు ఉపయోగపడే విద్యుత్ నియంత్రిక ఇటీవల కాలంలో మొరాయించింది. దీంతో మోటార్లు పనిచేయకపోవడంతో పంటలకు నీరు అందక తండాలోని రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ నియంత్రిక పాడై వారం రోజులు కావస్తున్నా ఎవరూ ఈ సమస్యను గుర్తించలేదు. దీంతో స్థానిక వైకాపా మండల నాయకులు రంభాల.నాగేశ్వరరావు ఈ విషయాన్ని గుర్తించి సదరు సమస్యను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో వారు సకాలంలో స్పందించి నూతన విద్యుత్ నియంత్రికను ఏర్పాటు చేయడానికి శనివారం సన్నాహాలు మొదలుపెట్టారు. విద్యుత్ శాఖ ఏఈ వెంకట్రావు నేతృత్వంలో సిబ్బందితో కలిసి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలో నెలకొన్న కరెంటు సమస్యపై స్పందించి పరిష్కారానికి కృషి చేసిన వైకాపా నాయకులు రంభాల.నాగేశ్వరరావుకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ శాఖా సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.