04:06 PM, 7 Sunday March 2021

తూర్పు ఏజెన్సీలో కంటైనర్లో 900 కేజీల గంజాయి పట్టివేత

తూర్పు ఏజెన్సీలో 900 కేజీల గంజాయి పట్టివేత
– మోతుగూడెం పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
– పరారీలో మరో ముగ్గురు నిందితులు

చింతూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

కంటైనర్ లో తరలిస్తున్న నిషేధిత గంజాయిని చింతూరు మండల పరిధిలోని మోతుగూడెం చెక్ పోస్ట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే చింతూరు డిఎస్పీ ఎస్.కె.ఖాదర్ బాషా ఆదేశాల మేరకు సీఐ యువకుమార్ పర్యవేక్షణలో ఎస్సై వి.సత్తిబాబు తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టగా ఒడియా క్యాంపు వైపు నుండి పోలీస్ స్టేషన్ వైపు వస్తున్న కంటైనర్ ను ఆపి తనిఖీ చేయగా ఇద్దరు వ్యక్తులతో పాటు సుమారు 27 లక్షలు విలువ చేసే 900 కేజీల నిషేధిత గంజాయి వారి వద్ద ఉన్నట్లు గుర్తించామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్సై సత్తిబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా వారిరువురు ఒడియా క్యాంపు నుండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ కు గంజాయిని తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. దాంతో వారి వద్ద ఉన్న 900 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని రెవెన్యూ మరియు అటవీశాఖ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఇద్దరు నిందితులపై కేసులు నమోదు చేసి రంపచోడవరం కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఎస్సై వి.సత్తిబాబు తెలిపారు. అయితే ఇటీవల కాలంలో ఇంజనీరింగ్ యువతను లక్ష్యంగా చేసుకుని ఇతర రాష్ట్రాలకు గంజాయి పెద్దఎత్తున అక్రమ రవాణా జరుగుతుందనే వార్త ఏజెన్సీ ప్రాంతంలో హల్చల్ చేస్తోంది. దీనికి తెలంగాణ ప్రాంతంలోని భద్రాచలం పట్టణంలో సైతం పోలీసులకు పట్టుబడ్డ వాహనాలే ఇందుకు ఉదాహరణ. ఈ పరిస్థితుల్లో గంజాయి రవాణాను కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది గుర్తించాలి.

 

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#