12:15 AM, 4 Thursday March 2021

నెల్లిమర్ల అమరవీరుల త్యాగాలు మరువలేనివి

– రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి
– భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన
– అఖిల భారత రైతు-కూలీ సంఘం సంఘీభావం

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

నెల్లిమర్ల అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఐఎఫ్ టియు రాష్ట్ర కార్యదర్శి జల్లూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నెల్లిమర్ల అమరవీరుల 27 వర్ధంతి సందర్భంగా ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న రైతాంగ పోరాటానికి సంఘీభావంగా ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు వారం రోజుల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం కాకినాడలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ నిరసనకు అఖిల భారత రైతు-కూలీ  సంఘం సంఘీభావం తెలిపింది. నెల్లిమర్ల జూట్ కార్మిక ఉద్యమంలో 27 సంవత్సరాల క్రితం పోలీసుల కాల్పుల్లో అసువులు బాసిన కాళ్ల అప్పల సత్యనారాయణ, నల్లి ముత్యాలనాయుడు, దువారపు చిన్న, కోళ అచ్చప్పాడు, కల్లూరి రాంబాబుల అమరత్వాన్ని స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల ప్రారంభ రోజుల్లో వాటి దుష్పాలితాలపై వచ్చిన నెల్లిమర్ల జూట్ కార్మిక ఉద్యమం ఐదుగురు కార్మిక యోధులు అమరత్వం పొందారని వారి త్యాగం మరువలేనిదని కొనియాడారు. ఆనాటి సమరశీల  నెల్లిమర్ల జూట్ కార్మిక ఉద్యమంలో కార్మికులకు అండగా రైతులు, రైతు కూలీలు, మహిళలు, పీడిత ప్రజలు అండగా నిలిచి కార్మిక, కర్షక, మైత్రి ఉద్యమంగా పోరాడి తమ హక్కులను సాధించుకున్నారన్నారు. నేడు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలు, మనువాద పోకడలను, కార్పొరేట్ అనుకూల విధానాలను తీసుకొచ్చి, ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్ లు, మూడు వ్యవసాయ చట్టాలను, ఆదివాసీలను అడవుల నుండి వెళ్ళగొట్టే అటవీ హక్కుల, టాడా, పోటా లను తలదన్నే ఫాసిస్ట్ ఉపా నిర్బంధ చట్టం, ఫాసిస్ట్ పౌరసత్వ చట్టం వంటి ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి కార్పొరేట్ వర్గానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని ఆయన విమర్శించారు. రైతాంగ వ్యతిరేక 3 నల్లచట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు గత రెండు నెలలుగా ఉద్యమిస్తుంటే నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా శాంతియుతంగా పర్మిషన్ తీసుకుని ట్రాక్టర్ పెరేడ్ జరుగుతుండగా అసాంఘిక శక్తులను దించి విధ్వంసం సృష్టించి రైతులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు ఆరోపించారు. దేశానికి నష్టం కలిగించే నల్ల చట్టాల రద్దుచేయలని, పోరాడుతున్న రైతాంగానికి సంఘీభావంగా కార్మికులు, రైతులు, మహిళలు, పీడిత ప్రజలు కలిసి “నెల్లిమర్ల అమరవీరుల” స్ఫూర్తి తో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ మొండి వైఖరిని విడనాడి దేశానికి నష్టం కలిగించే మూడు నల్ల చట్టాలను రద్దు చేసి న్యాయం చేయాలని వారు కోరారు. లేనిపక్షంలో ఈ దేశంలోని పీడిత ప్రజలు అంతా ఏకమై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు-కూలీ సంఘం జిల్లా నాయకులు వల్లూరి రాజబాబు, పి బసవయ్య, మడికి సత్యం, పీవైఎల్ నాయకులు మల్లవరపు రాజు, ఐఎఫ్ టియు నాయకులు బిఎస్ఎన్ మూర్తి, ఎం రాజు, రాజేష్, కృష్ట, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#