– జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి
కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టే ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రి సేకరణకు మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని.. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఉదయం కలెక్టరేట్లోని కోర్టుహాల్లో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో కలిసి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి.. ఇళ్ల నిర్మాణ సామగ్రి సేకరణపై జిల్లా స్థాయిలో ఏర్పాటైన టెండర్ కమిటీ (డీఎల్టీసీ) సమావేశం నిర్వహించారు. 40 ఎంఎం, 20 ఎంఎం హెచ్‌బీజీ మెటల్, కాల్చిన మట్టి ఇటుకలు, ఫాల్-జీ ఇటుకలు, ఆర్సీసీ రింగ్ వెల్స్, కవర్స్ తదితర సామగ్రి సరఫరాకు ఇప్పటి వరకు చేపట్టిన టెండర్ ప్రక్రియ, బిడ్డర్ల వివరాలు, కోట్ చేసిన మొత్తాలపై చర్చించారు. సామగ్రి సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేయాలని కలెక్టర్.. సూచించారు. ఈ ప్రక్రియపై తహశీల్దార్లు, ఎంపీడీవోలకు అవసరమైన సూచనలు ఇవ్వాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు జరిగే లేఅవుట్లలోనే నిర్మాణ సామగ్రి తయారీ జరిగేలా ఆయా యూనిట్ల యాజమాన్యాలతో మాట్లాడాలని సూచించారు. దీనికి సమాంతరంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలతో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే ఔత్సాహికులతోనూ సమావేశాలు నిర్వహించాలని పరిశ్రమల శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ చర్యల వల్ల తక్కువ ధరకు అత్యంత నాణ్యమైన సామగ్రి అందుబాటులోకి వస్తుందన్నారు. యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయింపు వంటి ఏర్పాట్లపై దృష్టిసారించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ జి.వీరేశ్వర ప్రసాద్, గ్రామీణ నీటి సరఫరా సూపరింటెండింగ్ ఇంజనీర్ టి.గ్రాయత్రీదేవి, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, లేబర్, మైన్స్ అండ్ జియాలజీ, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ విభాగాలకు చెందిన అధికారులు హాజరయ్యారు.