05:45 PM, 28 Thursday January 2021

పారిశ్రామిక అభివృద్ధికి స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌

– ఎగుమ‌తులు పెంచేందుకు చ‌ర్య‌లు
– క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డి

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి, అందుబాటులో ఉన్న అన్ని వ‌న‌రుల‌నూ ఉప‌యోగించి స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణతో ముందుకెళ్లాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి మురళీధర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం కాకినాడలోని కలెక్టరేట్ నుంచి జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ డి. మురళీధర్ రెడ్డి జిల్లా పారిశ్రామిక‌, ఎగుమ‌తుల ప్రోత్సాహ‌క క‌మిటీ (డీఐఈపీసీ) స‌మావేశాన్ని జూమ్ కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం ద్వారా జిల్లాలో 3.84 ల‌క్ష‌ల మంది ల‌బ్ధిపొంద‌నున్నార‌ని, ద‌శ‌ల వారీగా ఇళ్ల నిర్మాణాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని ఈ ప్ర‌క్రియ‌లో వివిధ ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌ని సూచించారు. పెద్ద లేఅవుట్ల‌లో ఫాల్‌-జీ బ్రిక్స్ వంటి ఇళ్ల నిర్మాణ సామాగ్రి త‌యారీదారుల‌కు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి, అక్క‌డే త‌యారుచేసేలా చూడాల‌న్నారు. దీనివ‌ల్ల అటు ప‌రిశ్ర‌మ‌లకు ప్రోత్సాహం ల‌భించ‌డంతో పాటు పాటు త‌క్కువ ధ‌ర‌కు, నాణ్య‌మైన సామాగ్రి అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు. అదే విధంగా ర‌వాణా ఖర్చులు కూడా త‌గ్గుతాయ‌న్నారు. పారిశ్రామిక అభివృద్ధి విధానం (2015-20) ప‌రిధిలో 58 ఎంఎస్ఎంఈ యూనిట్ల‌కు ప్రోత్సాహ‌కాల కింద రూ.2.32 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపిన‌ట్లు వెల్ల‌డించారు. గ‌తేడాది డిసెంబ‌ర్ 11; 2021, జ‌న‌వ‌రి 7న స్క్రుటినీ వెరిఫికేష‌న్ క‌మిటీ (ఎస్‌వీసీ) స‌మావేశాలు జ‌రిగిన‌ట్లు తెలిపారు. ముఖ్యంగా ఆహారం, వ్య‌వ‌సాయం, నిర్మాణం, ప్యాకింగ్‌, ఆటోమోటివ్‌, మెరైన్‌/ఆక‌్వా, మిన‌ర‌ల్‌, ర‌సాయ‌నాలు, ఇంజ‌నీరింగ్, స్థానిక డిమాండ్ ఉన్న ఉత్ప‌త్తుల ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధికి కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. దీనికి సంబంధించి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌న్నారు. పారిశ్రామిక అనుమ‌తుల‌కు సంబంధించి సింగిల్ డెస్క్ పాల‌సీ కింద 2021, జ‌న‌వ‌రి 7 నాటికి 113 ద‌ర‌ఖాస్తులు అందాయ‌ని, వీటిలో 76 ద‌ర‌ఖాస్తుల‌కు ఆమోదం ల‌భించింద‌ని, 37 ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. వీటిని నిర్దేశ గ‌డువులోనే ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు.  స‌మ‌గ్ర ప‌రిశ్ర‌మ స‌ర్వే (2020)కు సంబంధించి పెండింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. బియ్యం, చ‌క్కెర‌, గ‌డ్డ‌క‌ట్టించిన రొయ్య‌లు ఫ్రోజన్ శ్రీఎంప్, కొబ్బ‌రి పీచు, కొబ్బ‌రి పొట్టు ఉత్ప‌త్తుల‌ను ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ మార్కెట్‌కు ఎగుమ‌తి చేస్తున్న‌ట్లు ప‌రిశ్ర‌మ‌ల శాఖ అధికారులు స‌మావేశంలో వెల్ల‌డించారు. జిల్లా నుంచి ఎగుమ‌తులు మ‌రింత పెరిగేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. స్టెయిన్‌లెస్ స్టీలు పైపులు, హెర్బ‌ల్ ప్రొడక్ట్స్, జీడిప‌ప్పు, సేంద్రియ ఆహారం, బ్రాస్‌/‌కాప‌ర్ వ‌స్తువులు వంటివి కూడా ఎగుమ‌తుల‌కు అనువైనవ‌ని గుర్తించిన‌ట్లు వెల్ల‌డించారు. స‌మావేశంలో ప‌రిశ్ర‌మ‌ల శాఖ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ బి.శ్రీనివాస‌రావు, డీజీఎఫ్‌టీ జేడీ ర‌మేశ్‌, ఎల్‌డీఎం ష‌ణ్ముఖ‌రావు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#