09:48 AM, 26 Friday February 2021

ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ

– ఎన్నికల కమిషన్ నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలి
– పెద్దాపురం మండలం పలు గ్రామాల్లో నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన
– జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి

పెద్దాపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్దమైందని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పెద్దాపురం మండలం ఆర్.బి.పట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వాలు తిమ్మాపురం, ఆర్.బి.కొత్తూరు, సిబి దేవం, ఆర్.బి.పట్నం లకు సంబంధించిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ అపరాజిత సింగ్ సిన్సిన్వార్, ఆర్డీవో ఎస్. మల్లిబాబుతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో ఫేజ్-1 కింద కాకినాడ, పెద్దాపురం డివిజన్ లలో 20 మండలాల్లో ఉదయం 10.30 గంటల నుండి  నామినేషన్ స్వీకరణ ప్రక్రియ మొదలైందని  తెలిపారు. ఇప్పటి వరకు సిబ్బంది పరంగా స్టేజ్-1, స్టేజ్-2 ఎన్నికల అధికారులకు జిల్లా, మండల స్థాయిలలో శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వివిధ శాఖల అధికారులను నియమించి ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ముందుగానే ఏకగ్రీవాలపై ప్రచారం జరుగుతోందని ఆ ప్రచారాలు నిజం కాదని అన్నారు. పోటీలో నిలిచే అభ్యర్థులు తుది జాబితా విడుదల  అయిన తర్వాత మాత్రమే ఏకగ్రీవాలు ధృవీకరించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏకగ్రీవంకు జిల్లా యంత్రాంగం మద్దతుగా ఉంటుందని, ఆ ఏకగ్రీవాన్ని ఏవిధంగా జరిగిందో పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని పోస్టింగ్ చేస్తే పోలీసుల విచారణ జరిపి, చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైనా సమస్యను ఖచ్చితంగా గుర్తిస్తే జిల్లా యంత్రాంగం దానిపై స్పందించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలు స్వేచ్చాయుత, నిష్పక్షపాత వాతావరణంలో నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముందు నామినేషన్ కు సంబంధించి గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ, డిపాజిట్ చెల్లింపు, ఓటరు జాబితా తనిఖీ చేయు ప్రదేశం, నోటీసు బోర్డులో అమర్చిన ఎన్నికల సమాచారం, నామినేషన్ స్వీకరించే రిటర్నింగ్ అధికారి గదిని కలెక్టర్ పరిశీలించి, వచ్చిన నామినేషన్ ల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పంచాయతీ కార్యాలయం ఆవరణలో మూసివేసిన సంక్షేమ పథకాల పోస్టర్లు, ప్రముఖుల ఫోటోలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో ఏ.రమణారెడ్డి, తహశీల్దార్ బి.శ్రీదేవి, ఈవోపీఆర్డీ హిమ మహేశ్వరి, పంచాయతీ కార్యదర్శి జె. పద్మరాజు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#