– కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి హెచ్చరిక
– జిల్లాస్థాయి మత సామరస్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి
– జిల్లాలో మత పెద్దలు అందిస్తున్న సహకారం మరువలేనిదని వ్యాఖ్య
– ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని విజ్ఞప్తి
కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
తూర్పుగోదావరి జిల్లాలో మత సామరస్యం వెల్లివిరుస్తోందని, ఇదే విధమైన ఐక్యతా వాతావరణం కొనసాగాలని దీనికి వివిధ మతాల పెద్దలు సహకరించాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని కోర్టుహాల్లో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, అడిషనల్ ఎస్పీ (ఎస్ఈబీ) సుమిత్ గరుడ్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు తదితరులతో కలిసి కలెక్టర్.. వివిధ మతాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజా క్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన చర్యల్లో మత పెద్దలు చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ఇదే రకమైన సేవాభావం, సహకార స్ఫూర్తిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రజలు, పోలీసులు, మతపెద్దలు, అధికారులు అందరూ మిత్రుల మాదిరి వ్యవహరిస్తుండటంతో శాంతియుత వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. వివిధ మతాలకు సంబంధించిన పండగల సమయంలో ఎవరూ ఎప్పుడూ సహనం కోల్పోలేదని, ఐకమత్యంగా మెలిగారన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్థానిక పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని, శాంతియుతంగా సమస్య పరిష్కరానికి కృషిచేయాలన్నారు. అయితే జరిగిన సంఘటనను రకరకాల ప్రయోజనాలను ఆశించి, వక్రీకరించి వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. శాంతికి విఘాతం కలిగించేలా సోషల్ మీడియా లేదా మరేవిధంగానైనా వదంతులను ప్రచారం చేసే అసాంఘిక శక్తులపై ఐపీసీ 504, ఐపీసీ 295 (ఏ) సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మతాన్ని ఆయుధంగా ఉపయోగించుకొని లబ్ధిపొందాలనుకునే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదన్నారు. కరోనా వంటి పెద్ద కష్టంతో ఒకవైపు ప్రజలు ఇబ్బందిపడుతుంటే, దీనికి అదనంగా కొత్త సమస్యల్ని సృష్టించేందుకు ప్రయత్నించడం మంచిదికాదన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ఆసరాగా నిలబడేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నసమయంలో అశాంతికి ప్రయత్నించడం తగదని కలెక్టర్ స్పష్టం చేశారు.
జిల్లా స్థాయిలో మత శాంతి, సామరస్య కమిటీ
రాష్ట్ర ప్రభుత్వ జీవో నెం.6 ప్రకారం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీకి సమాంతరంగా జిల్లాస్థాయిలో మత సామరస్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. మతపరమైన ప్రజల విశ్వాసాలకు రక్షణ కల్పించేందుకు, సామరస్యాన్ని కాపాడే లక్ష్యంతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయి కమిటీకి కలెక్టర్ ఛైర్మన్‌గా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారన్నారు. ప్రతి మతం నుంచి ఓ ప్రతినిధి సభ్యులుగా ఉంటారని వివరించారు. అసిస్టెంట్ డైరెక్టర్ (మైనారిటీస్), అసిస్టెంట్ డైరెక్టర్ (ఎండోమెంట్స్)లు కూడా సభ్యులుగా ఉంటారని, జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ) సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. సభ్యుల కూర్పుపై కసరత్తు జరుగుతోందన్నారు. సమావేశానికి హాజరైన హిందూ, ముస్లిం, క్రైస్తవం, సిక్కు, బౌద్ధం, జైన తదితర మతాలకు చెందిన పెద్దల నుంచి మత సామరస్యాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఆహ్వానించారు. ఈ సూచనలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. దశల వారీగా గ్రామ, మండల, డివిజన్ స్థాయిలోనూ మత సామరస్య కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు.
కమిటీ విధివిధానాలను వివరించిన జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ
జిల్లాస్థాయి మత సామరస్య కమిటీ విధివిధానాలను జాయింట్ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సమావేశంలో వివరించారు. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే అవసరమైన కార్యాచరణతో కమిటీ రంగంలోకి దిగుతుందని, మత శాంతి, సామరస్య పునరుద్ధణకు చర్యలు తీసుకుంటుందని జేసీ వివరించారు. మత సామరస్య సాధనకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తుందన్నారు. గత సంఘటనలను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తుందని తెలిపారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు కమిటీ సమీక్షిస్తుందన్నారు. భూములు లేదా ఇతర సంఘటనల వల్ల ఘర్షణలు చెలరేగే అవకాశం ఉన్నచోట పరిష్కారం కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుందన్నారు. ప్రార్థనా మందిరాలు, నిర్మాణాలు, చారిత్రక కట్టడాల వద్ద భద్రతా ప్రణాళికను రూపొందించి, అమలు చేస్తుందని తెలిపారు. ప్రజల్లో మతసామరస్యం పెంపొందించేలా జిల్లా స్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటనలు జరుపుతుందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణ పురోగతిని కమిటీ సమీక్షిస్తుందన్నారు. ఐక్యతా భావాన్ని, మత సామరస్య స్ఫూర్తిని విద్యార్థుల్లో పెంపొందించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమాలను ఏర్పాటుచేస్తుందని జేసీ వివరించారు. మత సామరస్య స్థాపనకు పోలీసు శాఖ పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు అడిషనల్ ఎస్పీ (ఎస్ఈబీ) సుమిత్ గరుడ్ సమావేశంలో తెలిపారు. పోలీసు శాఖ నుంచి ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని మత పెద్దలతో పేర్కొన్నారు. ప్రార్థనా స్థలాల వద్ద రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నామని, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో శాంతి కమిటీలు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. సమావేశంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (రాజమహేంద్రవరం) కేఎన్‌వీడీవీ ప్రసాద్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి పీఎస్ ప్రభాకరరావు, జిల్లా వక్ఫ్‌బోర్డ్ ఇన్స్పెక్టర్ సులేమాన్ బాషా, వివిధ మతాల పెద్దలు పాల్గొన్నారు.