09:41 AM, 15 Friday January 2021

రైతు భరోసా కేంద్రాలలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు

– మంత్రి విశ్వరూప్

అమలాపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రైతు భరోసా కేంద్రాల లో త్వరలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులనుంచి పాలు సేకరించి లీటర్ ఒక్కంటికి మార్కెట్ విలువ కంటే ఐదు,లేదా ఆరు రూపాయలు అదనంగా రైతులకు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలియ చేసారు. మంగళవారం అమలాపురం రూరల్ మండలం ఏ. వేమవరం లో 45 నుండి 60 సంవత్సరాలు వయస్సు కలిగిన 31 మంది లబ్ధిదారులకు (మహిళా రైతులకు) వైఎస్ఆర్ చేయూత పథకం క్రింద ఒక్కొక్కటి 75 వేలు విలువ చేసే పాడి గేదెలను మంత్రి పంపిణీ చేశారు. ఇందులో 18750 రూపాయలు మార్జిన్ మనీ కాగా మిగిలింది రుణం రూపంలో లబ్ధిదారులు చెల్లించవలసి వుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పాల ఉత్పత్తి దారుల సంఘాలుగా ఏర్పడి రైతు భరోసా కేంద్రాలకు పాలను సరఫరా చేస్తే ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని మంత్రి తెలిపారు. అంతేకాకుండా వారి ఉత్పత్తి చేసే పాలకు మార్కెట్ లో కూడా ధర ఎక్కువ పలుకుతుందని మంత్రి తెలిపారు. వైఎస్ఆర్ చేయూత లో పాడి పశువులను తీసుకున్న లబ్ధిదారులకు దురదృష్ట వశాత్తూ పాడి పశువు మరణిస్తే ఎంత మొత్తానికి ఇన్సూరెన్స్ చేశారో ఆ మొత్తాన్ని రైతుకు ఇవ్వడం జరుగుతుందని మంత్రి అన్నారు.అలాగే ప్రతీ గ్రామ,వార్డు సచివాలయాల్లో పశు వైద్య సహాయకులను ఏర్పాటు చేయడం జరిగిందని,చిన్నచిన్న జబ్బులకు వీరు ఇంటికి వచ్చి పశువులకు వైద్య సేవలు అందిస్తారని రైతులు వీరి సేవలను వినియోగించుకోవాలని మంత్రి తెలియ చేశారు.త్వరలో వైఎస్ఆర్ చేయూత పథకం లో భాగంగా ఉన్నతి పథకం క్రింద మరో 33 మంది ఎస్సి మహిళా రైతులకు పాడి పశువులను అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఏ వేమవరం గ్రామానికి చెందిన 12 మంది మహిళా రైతులకు, ఏ.వేమవరప్పాడు గ్రామానికి చెందిన 9 మందికి,అమలాపురం అర్బన్ కు చెందిన 8 మందికి,నల్లమిల్లి కి చెందిన  ఇద్దరు రైతులకు పాడి పశువులను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు బాంకులనుండి రుణాలు పొందడం లో అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటామని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో మట్ట పర్తి నాగేంద్ర, చెల్లు బోయిన శ్రీనివాస్, కు డుపూడి వేంకటేశ్వర(బాబు), బొంతు గోవింద శెట్టి,బొక్కా ఆదినారాయణ, కామీసెట్టి శ్రీనివాస్,దొంగ సునీత శ్రీను, పిచ్చిక ప్రభాకర్, పి.కె.రావు, దం గేటి బుల్లి అబ్బులు,గొర్తి శాస్త్రి, మట్టపర్తి నాగరాజు, సరెళ్ళ రామకృష్ణ, కండేబోయిన వెంకటేశ్వరరావు, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డా. ఎల్ విజయరెడ్డి, అమలాపురం మునిసిపల్ కమీషనర్ వి ఐపి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#