శ్రీకాకుళం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
సఖి వన్ స్టాప్ సెంటర్ లో బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, పోస్కే చట్టం, డొమెస్టిక్ వయొలెన్స్, తదితర అంశాలపై శుక్రవారం అవగాహనా కార్యక్రమం జరిగింది. వన్ స్టాప్ సెంటర్ లో అందించే సేవలను ఈ సందర్భంగా అవగాహన కలిగించారు. బాల్య వివాహాలపై కౌన్సిలింగ్, పోలీసు సహాయం, న్యాయ సహాయం, వైద్య సహాయాలు ఏ విధంగా అందిస్తారు అనే విషయాలను ఎస్.ఐ. విపులంగా వివరించారు. ఆడపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై వివరించారు. పిల్లల పట్ట అసభ్యంగా ప్రవర్తిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఏ విధంగా మసలుకోవాలి అనే విషయాన్ని తెలిపారు. చిన్నతనంలో వివాహాలు చేసుకోవడం వలన ఆడపిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయని, బలహీనంగాను, తక్కువ బరువుతోను పిల్లలు పుడతారని తెలిపారు. చదువు మధ్యలో ఆపివేసి బాల్య వివాహాలు చేస్తున్న వారి వివరాలను 1098 ఫోన్ కాల్ ద్వారా తెలియచేయాలని చెప్పారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసి వారిని వేరే రాష్ట్రాలకు, విదేశాలకు తీసుకు వెళ్ళి వ్యభిచార గృహాలకు అమ్మడం, ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి వారిని మోసం చేసే వారికి కఠినమైన శిక్షలను వేయడం జరుగుతుందని తెలిపారు. పిల్లలు, పరిచయస్తులు కాని వ్యక్తులతో గాని, తల్లి తండ్రులు మరియు ఉపాధ్యాయుల అనుమతి లేకుండా పిల్లలను తీసుకుని వెళ్ళడం అనేది కిడ్నాప్ క్రిందకు వస్తుందని అటువంటి వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు. గృహ హింస చట్టం ప్రకారం మహిళలను ఇంటిలోని వారు హింసిస్తే, వుమెన్ హెల్ప్ లైన్, పోలీసు హెల్ప్ లైన్ నంబర్లకు ఫోను చేసి న్యాయాన్ని పొందవచ్చునని తెలిపారు. వీరికి వన్ స్టాప్ సెంటర్ లో కౌన్సిలింగ్ చేయడం, పోలీసు సహాయం, న్యాయ సహాయాలను అందించడం జరుగుతుందని, ఆశ్రయాన్ని అందించి, వైద్య సహాయం కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. వన్ స్టాప్ సెంటర్ కు ఆశ్రయం కోసం స్వధార్ హోమ్, స్టేట్ హోమ్ లో ఆశ్రయం కల్పించడం జరుగుతున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. డి.రేణుక, ఎపిడి పి.రాధాకృష్ణ విద్యార్ధినీవిద్యార్ధులు, తదితరులు హాజరైనారు.