మెల్బోర్న్, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
నటరాజన్.. ఈ ఐపీఎల్ ద్వారా నిరూపించుకుని భారత జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడిన నటరాజన్.. టెస్టు జట్టులో సైతం అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్… గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తే ఆ స్థానాన్ని నటరాజన్ చేజిక్కించుకున్నాడు. మూడో టెస్టు నాటికి ఎవర్ని ఎంపిక చేయాలనే దానిపై టీమిండియా మేనేజ్మెంట్ అనేక తర్జన భర్జనలు పడిన తర్వాత నటరాజన్‌ను ఎంపిక చేసింది. ఇక్కడ నటరాజన్ అదృష్టం వరించిందనే చెప్పాలి. భారత క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం నటరాజన్‌ను జట్టుతో పాటే ఉంచుకోగా అతనికి టెస్టుల్లో ఆడే అవకాశం రావడం లక్కీగానే చెప్పాలి.
శుక్రవారం నటరాజన్‌ను టీమిండియా స్క్కాడ్లో చేర్చుతూ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. దాంతో నటరాజన్ ప్రాక్టీస్‌పై సీరియస్‌గా దృష్టి సారించాడు. మెల్బోర్న్లో ప్రాక్టీస్ చేసే క్రమంలో ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు నటరాజన్. మరొక యార్కర్ల స్పెషలిస్టుగా ఇప్పుడిప్పుడే అభిమానుల మదిలో స్థానం సంపాదించుకుంటున్న నటరాజన్.. ఓ క్యాచ్‌ను వెనక్కి పరుగెడుతూ అందుకున్న తీరు అబ్బురపరచడమే కాదు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్వీటర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ‘ ఈ పర్యటనలో నటరాజన్ తనకు వచ్చిన అవకాశాల్ని చాలా చక్కగా పట్టేస్తున్నాడు’ అనే క్యాప్షన్ ఇచ్చింది.