07:18 PM, 1 Monday March 2021

వ్యాధిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స అందిస్తే నివారణ సాధ్యమే

– వ్యాధిగ్రస్తులపట్ల వివక్షతతగదు
– లెప్రసి కాలనిలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి
– దాతలు సమకూర్చిన నూతన వస్త్రాలు, మందులు, పాదరక్షలు పంపిణీ
– జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

కుష్టు వ్యాధిగ్రస్తులపట్ల వివక్షత చూపడం తగదని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి అన్నారు. జిల్లా కుష్టువ్యాధి నివారణాసంస్థ, జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక లెప్రసి కాలనిలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. గౌరీశ్వరరావు తదితరులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ సమయంలో దేశ పర్యటన చేసిన మహాత్మాగాంధీ కుష్టువ్యాధిగ్రస్తుల పట్ల సమాజంలో గల వివక్షతను గుర్తించి వాటిని రూపుమాపేందుకు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యరంగంలో అనేక మార్పులు చోటుచేసుకుని చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని, ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స అందిస్తే నివారణ సాధ్యమేనని తెలిపారు. ఆహారపుఅలవాట్లు, పరిశుభ్ర వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డా.గౌరీశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 15 లెప్రసి కాలనీలు ఉన్నాయని తెలిపారు. పురాతనమైన విముక్తి కాలనీలో దాదాపు 50 కుటుంబాలవారు నివసిస్తున్నారని,జిల్లాలో 130 కేసులు నమోదయ్యాయని అన్నారు. సుమారు 400 మందికి సంవత్సరానికి రెండు సార్లు ప్రత్యేక పాదరక్షలు అందించడం జరుగుతోందని అన్నారు. కళ్ళు మూతపడని వారికి కళ్ళజోళ్ళు, నిత్యావసరాలు, ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ప్రపంచంలో మనదేశంలో కుష్టువ్యాది తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రతి లక్షమందిలో ముగ్గురికి వ్యాధి లక్షణాలు నమోదు అవుతాయని, నేడు అదుపులో ఉందని చెప్పారు. అనంతరం దాతలు సమకూర్చిన నూతన వస్త్రాలు, మందులు, పాదరక్షలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#