విజయవాడ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
గత ప్రభుత్వం విజయవాడ నగరంలో కూల్చివేసిన తొమ్మిది గుడులకు సంబంధించి పునర్ నిర్మాణ పనులకు సీఎం శ్రీ వైఎస్ జగన్ కృష్ణా తీరంలో సీతమ్మ పాదాల వద్ద భూమిపూజ నిర్వహించారు. దీంతోపాటు బెజవాడ కనకదుర్గమ్మ గుడి అభివృద్ది, విస్తరణలో భాగంగా రూ. 77 కోట్లతో చేపట్టిన మరో ఎనిమిది పనులకు కూడా సీఎం శ్రీ వైఎస్ జగన్ భూమిపూజ చేశారు. శనీశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేపట్టనున్న ప్రాంతంలో రెండు వేర్వేరు శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఇంద్రకీలాద్రి కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌కు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి అమ్మవారి జ్ఞాపిక, చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలతో దేవాదాయ శాఖ రూపొందించిన క్యాలెండర్‌తో పాటు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం క్యాలెండర్‌ను కూడా సీఎం శ్రీ వైఎస్ జగన్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, పలువురు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో ఎం వీ సురేష్‌బాబు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.