రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రాజమహేంద్రవరంలోని క్వారీ మార్కెట్ వద్ద హిజ్రాలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసారు. వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు సహకారంతో రిజిష్ట్రార్ ఆచార్య బట్టు గంగారావు ముఖ్య అతిథిగా హాజరై హిజ్రాలకు నిత్యవసర వస్తువులను అందజేసారు. రాజమహేంద్రవరం పరిసరప్రాంతాల్లోని 150 మంది హిజ్రాలు దీనిలో పాల్గొని నిత్యవసర వస్తువులను అందుకున్నారు. చిన్నతరహా కుటీర పరిశ్రమగా విస్తరాకుల తయారీ మిషనును విశ్వవిద్యాలయం నుండి అందించాలని తమకు ఉపాధి కల్పించాలని వారు కోరారు. దీనిపై రిజిష్ట్రార్ బట్టు గంగారావు మాట్లాడుతూ సమాజంలో అందరికీ గౌరవంగా జీవించే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని దానిని హిజ్రాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్వయం ఉపాధితో జీవించాలనే ఆలోచన చాలా మంచిదని దానికి విశ్వవిద్యాలయం సహకరిస్తుందని చెప్పారు. వారు కోరినట్లు కుటీర పరిశ్రమకు కావల్సిన సహకారాన్ని ఎన్.ఎస్.ఎస్ నుండి అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ డా.బి.కెజియారాణి, ప్రోగ్రామ్ అధికారులు పాల్గొన్నారు.