VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 11:22 pm Posted by : VISWAM VOICE DAILY

అమలాపురంలో ఘోరం: మైనర్ బాలికకు రహస్య అబార్షన్ యత్నం!

ప్రభుత్వ డాక్టర్ ప్రైవేట్ దందా.. నిబంధనలు గాలికి!

తల్లిదండ్రులకు తెలియకుండా ఆసుపత్రిలో అడ్మిషన్.. రంగంలోకి పోలీసులు.

అమలాపురం – విశ్వం వాయిస్ న్యూస్:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో మానవత్వాన్ని, వైద్య వృత్తిని నిలువునా ముంచేసే ఒక సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పచ్చని కోనసీమలో ప్రభుత్వ జీతం తింటూ, ప్రైవేట్ ఆసుపత్రి ముసుగులో కొందరు చేస్తున్న చీకటి దందా బట్టబయలైంది. ఒక మైనర్ బాలిక జీవితంతో ఆడుకుంటూ, చట్టవిరుద్ధంగా అబార్షన్ (గర్భస్రావం) చేయడానికి సిద్ధపడిన ఓ ప్రభుత్వ వైద్యురాలి వ్యవహారం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

కేస్ షీట్‌లో వివరాలు మాయం.. అంతా రహస్యం!

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పి. గన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  లో ప్రభుత్వ వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ లంకె శిరీష, అమలాపురంలోని ‘విమెన్ అండ్ కేర్ జనరల్ ఆస్పత్రి’ వేదికగా ఈ చీకటి వ్యవహారానికి తెరలేపారు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక మైనర్ బాలికను, ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా, సదరు బాలిక ప్రియుడు సదరు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చాడు.

తీరా చూస్తే, చట్ట ప్రకారం మైనర్ల విషయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను ఆసుపత్రి యాజమాన్యం పూర్తిగా గాలికి వదిలేసింది. విద్యార్థినికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, గుర్తింపు వివరాలను కేస్ షీట్‌లో నమోదు చేయకపోవడం గమనార్హం. కేవలం రక్తం తక్కువగా ఉండటం వల్లే అడ్మిట్ చేసుకున్నామని ఆసుపత్రి సిబ్బంది కల్లబొల్లి కబుర్లు చెబుతున్నప్పటికీ.. అసలు కథ వేరే ఉందని లోపల జరుగుతున్న వ్యవహారాలు స్పష్టం చేస్తున్నాయి.

ఫోన్ లొకేషన్‌తో గుట్టు రట్టు.. నిందితులు పరార్!

నగరం గ్రామానికి చెందిన ఈ మైనర్ బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే నగరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఫోన్ లొకేషన్ ఆధారంగా విచారణ జరపగా, సంచలన విషయాలు బయటపడ్డాయి. లొకేషన్ అమలాపురంలోని సదరు ప్రైవేట్ ఆసుపత్రిగా చూపించడంతో తల్లిదండ్రులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

తల్లిదండ్రులు ఆసుపత్రికి వస్తున్నారనే సమాచారం ముందే లీక్ అవ్వడంతో.. బాలికను తీసుకువచ్చిన ప్రియుడు, అతనికి సహకరించిన మిగిలిన వ్యక్తులు అక్కడి నుండి చాకచక్యంగా పరారయ్యారు.

అనుమతులు లేవు.. పర్యవేక్షణే లేదు!

ఈ ఉదంతంతో సదరు ఆసుపత్రి గుట్టు ఒక్కొక్కటిగా రచ్చకెక్కుతోంది. అసలు ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండానే ఈ ‘విమెన్ అండ్ కేర్ జనరల్ ఆస్పత్రి’ని నడుపుతున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందించాల్సిన సదరు వైద్యురాలు, ఇటువంటి అనధికారిక ప్రైవేట్ ఆసుపత్రుల అండతో ఇలాంటి అక్రమ గర్భస్రావాలకు తెగబడటం వెనుక పెద్ద నెట్‌వర్కే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మైనర్ బాలికల జీవితాలతో చెలగాటమాడుతూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న ఇలాంటి కీచకులు, వారికి అండగా నిలుస్తున్న వైద్యులపై ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఘటనపై నగరం మరియు అమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.