డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున సోమవారం (నవంబర్ 23) నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రెండు విడతల్లో జరగనున్న నేపథ్యంలో డిసెంబర్ 2వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దయినప్పటికీ ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను నమోదు చేసుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదుల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని, 95523 00009 వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ ద్వారా కూడా సమస్యలను తెలియజేయవచ్చన్నారు. అదేవిధంగా సమీపంలోని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించి సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లవచ్చని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. 95523 00009 నంబర్‌ను మొబైల్‌లో సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ‘Hi’ అని సందేశం పంపితే అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, రవాణా, దేవాదాయ తదితర శాఖలకు సంబంధించిన పౌర సేవలను కార్యాలయాలకు వెళ్లకుండానే పొందవచ్చని వివరించారు.ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ ఆధారిత అభిప్రాయ సేకరణ విధానాలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఫిర్యాదులు పరిష్కారమైన అనంతరం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా వాట్సాప్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు.జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో క్యూఆర్ కోడ్‌లను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. పోస్టర్లు, బ్యానర్లు, నోటీసుల ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.అయితే, ఫిర్యాదుల పరిష్కారంపై అభిప్రాయాలు తెలియజేయడం పూర్తిగా ప్రజల స్వచ్ఛంద నిర్ణయమని, ఎవరిపైనా ఒత్తిడి చేయరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించి ప్రభుత్వ సేవల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యమని జిల్లా ఎన్నికల అధికారి డా. ఆర్. మహేష్ కుమార్ పేర్కొన్నారు.