VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 1:36 pm Posted By : VISWAM VOICE DAILY

కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ

జగ్గంపేట, విశ్వం వాయిస్: పెళ్లై కనీసం నెల రోజులు కూడా గడవకముందే ఒక నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన తీవ్ర విషాద ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. కిర్లంపూడి మండలం గోనేడ గ్రామానికి చెందిన సత్యంశెట్టి వెంకటలక్ష్మి అనే వివాహిత భర్త వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది.

**వివరాల్లోకి వెళితే..**
గోనేడ గ్రామానికి చెందిన వెంకటలక్ష్మికి, పెద్దాపురం మండలం మర్లవ గ్రామానికి చెందిన గాది కోటేశ్వరరావుతో గత ఏప్రిల్ 25వ తేదీన వివాహం జరిగింది. అయితే, పెళ్లైన కొద్ది రోజులకే భర్త కోటేశ్వరరావు ఆమెను మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ వేధింపులు భరించలేక, పెళ్లైన నెల లోపే వెంకటలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

**పోలీసుల దర్యాప్తు:**
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే కిర్లంపూడి ఎస్సై సతీష్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీసి, కుటుంబ సభ్యుల నుంచి ప్రాథమిక వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.