కె. గంగవరం:విశ్వం వాయిస్ న్యూస్
విద్యార్థుల అభ్యసనలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, పాఠశాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న సోషల్ ఉపాధ్యాయులు శ్రీ పితాని శ్రీనివాస్ గారు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అందించిన టీచర్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా జెడ్.పి.హెచ్.ఎస్ కె. గంగవరం పాఠశాల ఆవరణలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి.వి. సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో శ్రీ పితాని శ్రీనివాస్ గారిని ఘనంగా సత్కరించారు.విద్యార్థులకు సోషల్ సబ్జెక్ట్‌ను బోధించడంతో పాటు, లిసనింగ్ , స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ నైపుణ్యాలలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శ్రద్ధతో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. సాధారణ తరగతి గదిలో ఇతర విద్యార్థులతో సమానంగా చదువును కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ప్రత్యేకంగా సమయం కేటాయించి, వారి అభ్యసన లోపాలను అధిగమించేలా శ్రీ పితాని శ్రీనివాస్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.అదేవిధంగా చదువులో వెనుకబడిన అనేకమంది విద్యార్థులకు పాఠశాల సమయానికి అదనంగా కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం సేవాభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత కూడా విద్యార్థుల కోసం సమయాన్ని కేటాయిస్తూ చేస్తున్న సేవలను గుర్తించిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ మొండి రవికుమార్ గారు ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందజేశారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.గౌరవనీయులైన రేంజర్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి నాగమణి గారి చేతుల మీదుగా శ్రీ పితాని శ్రీనివాస్ గారు ఈ అవార్డును అందుకున్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల సమయంతో పాటు అదనపు సమయంలో కూడా కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి, వారి సేవలను ప్రోత్సహిస్తూ అవార్డులు అందిస్తున్న చేయూత స్వచ్ఛంద సేవా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడంలో శ్రీ పితాని శ్రీనివాస్ చేస్తున్న కృషి ఇతర ఉపాధ్యాయులకు కూడా స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. విద్యార్థుల కోసం సేవాభావంతో పనిచేసే ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా విద్యా రంగంలో మరింత నాణ్యమైన సేవలకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.ఈ సత్కార కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని శ్రీ పితాని శ్రీనివాస్ గారికి అభినందనలు తెలిపారు.