ద్రాక్షారామ: విశ్వం వాయిస్ న్యూస్
శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల సందర్శించారు.ఆలయానికి విచ్చేసిన ఆమెకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గాభవానిల ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సుభాష్ ఆమెను ఆలయంలోకి తీసుకెళ్లి శ్రీ మాణిక్యాంబా అమ్మవారు, శ్రీ భీమేశ్వర స్వామివార్ల దర్శనం చేయించి, ప్రత్యేక పూజలు మరియు కుంకుమార్చన కార్యక్రమాలను జరిపించారు.దర్శనానంతరం బేడా మండపంలో వేద పండితులు, అర్చకులు అన్నా కొణిదెలకు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు సంపత్ దంపతుల కుమారుడికి ఆమె “యక్షిత్ ఓంకార్” అని నామకరణం చేసి, చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం మంత్రి వాసంశెట్టి సుభాష్, ఈవో అల్లు వెంకట దుర్గాభవాని కలిసి ఆమెకు పట్టు వస్త్రాలు, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, వేద పండితులు, జనసేన నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.