Newspaper Banner

మండపం ఉపాధిహామీ అవినీతిని వెలికి తీసిన జనసేన …!

  •  మండపం ఉపాధి పనుల్లో జనసేన పార్టీపై వివక్ష
  •  జనసేన కూలీలకు పనులు చెప్పని వైనం …!
  •  పొట్టకొట్టడంలో “దేశం” పార్టీ గుత్తాధిపత్యం …!
  •  పనులు చెయ్యకుండానే బిల్లులకు రంగం

శంఖవరం, విశ్వం వాయిస్ న్యూస్ ;

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపంలో జగనన్న ఇళ్ల కాలనీ స్థలాల నుంచి అక్రమంగా మట్టిని‌ తవ్వుకుపోతున్న అవినీతిని లోగడ వెలికి తీసి, దానికి అడ్డుకట్ట వేసిన స్థానిక జనసేన పార్టీ నాయకులు, పోలం బ్రదర్స్ పోలం వెంకటరత్నం, పోలం విష్ణుమూర్తి (పద్మ) మరో అవినీతిని కూడా తాజాగా వెలికి తీసారు. ఈ ఎన్.డి.ఎ. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి చెందిన కొందరు కూలీలకు ఉపాధి హామీ పథకంలో పనులు చెప్పకుండా వివక్ష చూపుతూ ఉన్నారనీ, వాస్తవానికి చెరువులో మట్టితీత అభివృద్ధి పనులు చేపట్ట కుండానే చేసినట్లు దస్త్రాల్లో నకిలీ మస్తర్లు వేసి, వారి పేరున వేతన చెల్లింపులకు రంగం సిద్ధం చేసిన అవినీతిని ఉపాధి కూలీలు, మీడియా ప్రతినిధుల సాక్షిగా శనివారం వెలికి తీసారు. శంఖవరం మీడియా బృందం పరిశీలనలో వెలుగు చూసిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉపాధి హామీ పథకంలో పనిచేయడానికి అన్ని అర్హతలూ ఉన్న గ్రామంలోని అన్ని సామాజిక వర్గాలు, పార్టీలు, మతాలకు చెందిన వేతనదారులకు సంవత్సరంలో ఒక్కో కుటుంబానికి (ఎంత మంది సభ్యులు ఉంటే అంత మందికీ కలిపి) గరిష్టంగా 100 రోజుల పాటు పని కల్పించి, వేతనాలను ఇవ్వాలి. అయితే దీనికి విరుద్ధంగా జనసేన పార్టీకి చెందిన కొంత మందికి ఈకెవైసి పూర్తి కాలేదు, ఆధార్ సీడింగ్ కాలేదు, ఐరిస్ (కంటి ముద్రలు) తీసుకోడం లేదు, కంప్యూటర్ మహాశయుడు ఒప్పుకోడం లేదు… వంటి వివిధ కుంటి సాకులతో పనులను చెప్పడం లేదు. వాస్తవానికి కొందరికి ఐరిస్ తీసుకోవడం లేదు. మరి కొందరికి కంప్యూటర్ సాంకేతిక సమస్యల వల్ల పనులు మంజూరు కావడం లేదు. ఇది గ్రామంలోని నూటికి నూరు శాతం మంది కూలీలకు సంభవిస్తున్న ఇబ్బంది మాత్రం కాదు. ఇది కేవలం కట్టకట్టి జనసేన కూలీలకు మాత్రమే పార్టీ పక్షపాతం, ఉపాధి హామీ పథకం క్షేత్ర స్థాయి సిబ్బంది వివక్షతో ఎదురవుతున్న ఉద్దేశ్య పూర్వకమైన కృత్రిమ సమస్య. ఇలా కూలి పనులను చెప్పక పోవడం వల్ల నష్టపోతున్న బాదితుల్లో మానుకొండ మరియమ్మ, దాసరి దుర్గాభవాని, ఇనకోటి మరియమ్మ, ముఖే మణి, తిరగటి సీతారత్నం, తిరగటి నాగమణి, నాగూరి దేవుడమ్మ, ముక్కుడుపల్లి నాగరత్నం, మరికొంత మంది పురుషులు ఏకమై స్థానిక కనకదుర్గ గుడి ప్రాంగణంలో శనివారం ఉదయం 10.30 గంటలకు ఉపాధి హామీ పథకం ఏపిఓ. ఎన్.వి.విఎస్. శ్రీనివాసరావు, టెక్నికల్ అసిస్టెంట్ (టిఏ) వింజమళ్ళ సతీష్ లను మీడియా బృందం సాక్షిగా నిలదీశారు. మాకు మూడు వారాలుగా కూలి పనులను చెప్పడం లేదు. ఐరిస్ పడ్డం లేదు. మీకు పని మంజూరు కాలేదు అంటున్నారు. గ్రామంలో రైత్వారీ వ్యవసాయ కూలి పనులు లేవు.‌ మరి మేం ఎలా బ్రతకాలీ. మేం అందరం ఓట్లేస్తేనే కదా ప్రభుత్వం నెగ్గిందీ అని వారి ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన ఏపిఓ.టిఏలు ప్రతిస్పందిస్తూ… మీరంతా వచ్చే సోమవారం నుంచి పనుల్లోకి రండి అని సర్ది చెప్పారు. కూలీల పొట్టకొట్టడంలో “దేశం” పార్టీ గుత్తాధిపత్యం కొనసాగుతున్నట్టు వెల్లడైంది. ఈ అవినీతి భాగోతం ఇలా ఉంటే…‌ ఏకంగా ప్రభుత్వ నిధులను అక్రమంగా కాజేసే ఇంకొక అవినీతి కూడా ఇదే సందర్భంలో బట్ట బయలు అయ్యింది.

మండపంలో సోమవారం ఏప్రిల్ 27 నుంచి ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఊర చెరువు (వర్క్ ఐడి 61455), రాజన్నదొర చెరువు (వర్క్ ఐడి 62822), కట్టు గట్టు చెరువు (వర్క్ ఐడి 61490) ల్లో ప్రస్తుతం ఉపాధి హామీ పథకం పనులను చేస్తున్నట్టు అంతర్జాల దస్త్రాలు వెల్లడిస్తున్నాయి. అయితే వాస్తవానికి రాజన్నదొర, కట్టు గట్టు చెరువుల్లో మాత్రమే ఎంతో కొంత పనులు జరుగు తున్నాయి. కానీ ఊర చెరువులో మాత్రం అసలు పనులు ప్రారంభమే కాలేదు. ఈ చెరువులో గతంలో ఎవరో కొంత మట్టిని ట్రాక్టర్ తో తరలించుకున్న ఆనవాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. నిజం ఇదైతే… ఈ ఊర చెరువులో మొదటి వారంగా ఈ మే నెలలో సోమవారం 4 తేదీ నుంచి పనులను చేసినట్లు నకిలీ కూలీల పేరున మస్తర్లు వేసి దారినపోయే దానయ్యల ఛాయా చిత్రాలను అంతర్జాలంలో నమోదు చేసారు. ఈ వారానికి వీరికి చెల్లింపులు చేయాల్సిన కూలి సొమ్ముల మొత్తాలను నమోదుచేసి వేతనాల విడుదలకు ప్రతిపాదనలు చేసారు. అంతే కాకుండా రెండో వారంలో కూడా పనులు చేయక పోయినా సోమవారం 11 తేదీ నుంచి శనివారం వరకూ కూడా నకిలీ మస్తర్లను నమోదు చేశారు. సరిగ్గా ఇక్కడే ఏ జనసేన పార్టీ కూలీలకు మూడు వారాలుగా పనులు చెప్పకుండా పొట్టకొట్టారో అదే కూలీలకు పోలం బ్రదర్స్ పుణ్యమాని ఉపాధి హామీ పథకం సిబ్బంది అడ్డంగా దొరికి పోయారు. మాకేమో పనులు చెప్పడం లేదు. పని మంజూరైన ఊర చెరువులో పనులు చేయకుండానే చేసినట్టు నమోదు చేస్తున్నారు. ఏమిటీ మీ అధికారులు చేస్తున్న నిర్వాకం అంటూ కూలీలు ఉపాధి హామీ పథకం ఏపిఓ. ఎన్.వి.విఎస్. శ్రీనివాసరావు, టెక్నికల్ అసిస్టెంట్ (టిఏ) వింజమళ్ళ సతీష్ లను పెద్ద పెట్టున నిలదీశారు. వీరు పొంతన లేని సమాధానాలు చెప్పి బ్రతుకు జీవుడా అంటూ ఎలాగోలా అక్కడ నుంచి బయట పడ్డారు. ఐతే ఈ మొత్తం వ్యవహారంపై ఉపాధి హామీ పథకం ప్రధాన అధికారి, ఎంపీడీవో యు.నాగేంద్రకు శంఖవరంలోని మండల పరిషత్తు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలపోలం బ్రదర్స్ రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారం పదిరోజుల్లో విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన ఫిర్యాదీలకు హామీ ఇచ్చారు.