
* స్వల్ప ఛాతి నొప్పితో వెళ్తే.. ‘గుండెల్లో మూడు బ్లాకులు’ అంటూ బెంబేలెత్తించిన ప్రైవేట్ ఆసుపత్రి
* స్టంట్ల పేరిట కాకినాడకు తరలించేందుకు హడావుడి.. కమీషన్ల కోసమేనని బాధితుల ఆరోపణ
* మరో ఆసుపత్రిలో పరీక్షించగా ‘నార్మల్’.. నకిలీ వైద్యుల ముసుగుపై తనిఖీలకు స్థానికుల డిమాండ్
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు… కానీ డాక్టర్ల ముసుగులో ఉన్న కొందరు ప్రైవేట్ కేటుగాళ్లకు మాత్రం రోగి ప్రాణం కంటే.. వారి జేబులో పైసలే ముఖ్యం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. పవిత్రమైన వైద్య వృత్తిని వ్యాపారంగా మార్చేసి, కమీషన్ల కక్కుర్తి కోసం సామాన్య ప్రజలను నరకయాతనకు గురిచేస్తున్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం మండల కేంద్రమైన రాయవరంలో కలకలం రేపింది. ఎలాంటి వైద్య నిర్ధారణలు లేకుండానే, కేవలం భయపెట్టి లక్షలు గుంజాలనే కుట్ర బట్టబయలైంది.
*స్వల్ప నొప్పికే.. పెద్ద స్కెచ్!
బాధితులు తెలిపిన వివరాల మేరకు శనివారం ఉదయం ఛాతి భాగంలో స్వల్ప నొప్పిగా అనిపించడంతో ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న సదరు ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు. సాధారణ పరీక్షలు చేసి మందులు ఇవ్వాల్సింది పోయి, అక్కడ ఉన్న సిబ్బంది అతనికి పెద్ద ‘కార్డియాక్’ స్కెచ్ వేశారు. అనుభవం లేని సిబ్బందితో వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి సరైన మెడికల్ రిపోర్టులు, ఆధారాలు లేకుండానే.. “మీ గుండెల్లో మూడు బ్లాకులు ఉన్నాయి” అంటూ బాధితుడికి, అతని కుటుంబ సభ్యులకు చెప్పి తీవ్ర ఆందోళనకు గురి చేశారు.
* కమీషన్ల వేట లో కనికరం లేదా !
ఇంతటితో ఆగని ఆసుపత్రి యాజమాన్యం.. ఇది అత్యవసర కేసు అని, వెంటనే స్టంట్లు వేయించకపోతే ప్రాణాలకే ప్రమాదమంటూ హడావుడి సృష్టించింది. తాము ముందే కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రితో మాట్లాడామని, ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడికి తరలించాలని, చిన్నపాటి పరీక్షల అనంతరం అక్కడ వైద్యం ప్రారంభిస్తారని ఒత్తిడి తెచ్చారు. ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు, చూపిన అతి ఉత్సాహంపై బాధితులకు తీవ్ర అనుమానం కలిగించింది
*అసలు నిజం తేల్చిన మరో ఆసుపత్రి..
ప్రాణ భయంతోనే అలర్ట్ అయిన బాధితులు.. సదరు ఆసుపత్రి మాటలపై నమ్మకం కుదరక, ధైర్యం చేసి మరో కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. అక్కడ వైద్యులు అన్ని రకాల నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అసలు నిజం బయటపడింది. సదరు వ్యక్తికి గుండె సంబంధిత సమస్యలేమీ లేవని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, రాయవరం ఆసుపత్రి చేసిన మోసానికి నివ్వెరపోయారు.
* సర్టిఫికెట్లు కొనేసి.. నకిలీ ముసుగులో వైద్యం!
అనుభవం లేని సిబ్బందిని నియమించుకుని, కనీస వైద్య ప్రమాణాలు పాటించకుండా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఈ ప్రైవేట్ ఆసుపత్రిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం సర్టిఫికెట్లను కొనుగోలు చేసి, కొందరు డాక్టర్ల ముసుగులో నకిలీ వైద్యం సాగిస్తున్నారనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఆసుపత్రుల నుండి వచ్చే కమీషన్ల కోసమే రోగులను ఇలా బకరాను చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
* అధికారులు తనిఖీలు చేపట్టాలి: స్థానికుల డిమాండ్
ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన పవిత్ర వైద్య రంగంలో ఇలాంటి అక్రమ దందా సాగడం దురదృష్టకరమని రాయవరం వాసులు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సదరు ప్రైవేట్ ఆసుపత్రిపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే నిఘా ఉంచి, తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.