- ప్రజారోగ్యం కోసం ఇచ్చిన మందులు చెత్తకుప్పల్లోకి..
- పంచాయతీ నిర్లక్ష్యంతో విషవాయువుల భయం..
- దళితవాడల్లో ఆందోళన..
రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ :
ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మందులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయనే ఆరోపణలు రాయవరం మండలంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్రజలకు చేరాల్సిన ప్రభుత్వ మందులు మట్టిపాలవుతున్న దృశ్యాలు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే.. మరోవైపు వాటిని చెత్తతో పాటు తగలబెట్టే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా, మండల కేంద్రమైన రాయవరం లోని ప్రభుత్వ ఆసుపత్రి భవనం శిధిలావస్థకు చేరడంతో, ఆసుపత్రి భవనం గత సంవత్సరం లో మరొక ప్రాంతానికి మార్చారు. కాగా భవనం మార్పు సమయంలో తమకు అవసరమైన వస్తువులు , ఫర్నిచర్ ను తరలించి మందులు, ఇంజక్షన్లు, వైద్య సామగ్రి ని సక్రమంగా భద్రపరచకుండా పాత ఆసుపత్రి భవనం బయటే విడిచి పెట్టడం, అని ఇప్పటికీ అక్కడే ఉండడం వలన సిబ్బంది తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీనికి తోడు తాజాగా తుల్యభాగ నది పరిసరాల్లో నవంబర్ 2026 వరకూ గడువు ఉన్న కాల్షియం, విటమిన్ డి3 టాబ్లెట్లు పెద్ద ఎత్తున చెత్తలో మట్టి పాలవుతూ కనిపించడం చూస్తే వైద్యారోగ్య అధికారుల పర్యవేక్షణపై అనుమానాలు రేకెత్తిస్తూ, పలు ప్రశ్నలకు దారితీస్తుండగా ప్రజలకు అందాల్సిన మందులు చెత్తలోకి ఎలా చేరాయని, వాటి నిల్వలు, పంపిణీపై పర్యవేక్షణ ఏమైందనే ప్రశ్నలను పలువురు లేవనెత్తుతున్నారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన మందులను నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా విడిచిపెట్టడం, ఊరి చివర చెత్తలో పడేయడం బాధ్యతారాహిత్యమని పలువురు మండిపడుతున్నారు.

గ్రామంలోని సేకరించిన చెత్తనంతటిని, పంచాయతీ సిబ్బంది తుల్యభాగా నది తీరానికి చేర్చి నొప్పి పెట్టడం, చెత్తను దహనం చేయడం మరింత ఆందోళన కలిగించే అంశమని, పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ చెత్తను తగలబెట్టే సమయంలో ఈ మందులు కూడా మంటల్లో కలుస్తే విషవాయువులు ప్రబలి, దగ్గర్లోని పలు కాలనీలలోని ప్రజలు విషవాయువులు పీల్చి అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆరోపణలు ఉన్నాయి. మందులు, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వైద్య వ్యర్థాలు కాల్చడం వల్ల వెలువడే పొగలో ప్రమాదకరమైన విష వాయువులు ఉంటాయని.. అవి సమీపంలోని దళితవాడలను కమ్మేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు ఇప్పటికే పలుచోట్ల ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో లేవని ఫిర్యాదులు వస్తుండగా.. మరోవైపు అందుబాటులో ఉన్న మందులను చెత్తలో కలిపి కాల్చడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ప్రాధమిక ఆరోగ్యకేంద్ర సిబ్బంది నిర్లక్ష్యం తోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలోనే నిర్లక్ష్యం చోటు చేసుకోవడం దురదృష్టకరమని.. వెంటనే ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.