ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

ఎమ్మెల్యే గారూ కాస్తా ఇటు చూడరూ…!

పౌష్టికాహార వారోత్సవాల్లో పాలు లేకపాయే…!

ఎమ్మెల్యే గారూ , పిఓ సారూ కాస్తా ఇటు చూడరూ…..?
– మన్యంలో అంగన్వాడీలకు పాల సరఫరా ఇప్పట్లో లేనట్టేనా….?
– రెండు నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు దరిచేరని పాలు
– ఆదివాసీ బిడ్డలకు వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ అందేదెట్లా…?
– ఏజెన్సీలో అక్రమ పాల రవాణా పట్టుబడడంతోనే సరఫరా ఆగిపోయిందా..?
– లేక బయోమెట్రిక్ లేని మూలంగా ఆగిపోయిందా….?
– పాల సరఫరా విషయంలో జిల్లా కాంట్రాక్టర్ పై ఏమి చర్యలు చేపట్టినట్టు…?
– పాత కాంట్రాక్టర్ విషయంలో ఐసిడిఎస్ జిల్లా అధికారుల తీరు ఇకనైనా మారేనా….?
– అర్హులైన వారికి పాల సరఫరా చేసే బాధ్యతను అప్పగించాలి.
– అంగన్వాడీలకు త్వరగా పాలు సరఫరా చేయాలని గిరిజన , ప్రజా సంఘాల విజ్ఞప్తి

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ పథకం కాంట్రాక్టర్ల చేతివాటం మూలంగా ఏజెన్సీలో నీరుగారిపోతోందని , ఐసిడిఎస్ శాఖ ప్రస్తుతం పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహిస్తున్న క్రమంలో పాలు లేకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తోందని , దీంతో తక్షణమే రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి.ధనలక్ష్మి , చింతూరు ఐటిడిఏ పిఓ ఆకుల.వెంకటరమణ ఈ సమస్యపై దృష్టి సారించి గిరిజన బిడ్డలకు పౌష్టికాహారమైన పాలు అందేలా చర్యలు తీసుకోవాలని గిరిజన మరియు ప్రజా సంఘాల వారు విజ్ఞప్తి చేస్తున్నారు. చింతూరు ఏజెన్సీ పరిధిలో ఉన్న వి.ఆర్.పురం , కూనవరం (ఎటపాక) మరియు చింతూరు 3 ఐసిడిఎస్ ప్రాజెక్టుల ద్వారా 13 సెక్టార్లకు సంపూర్ణ పోషణ పథకం ద్వారా అందించే పాల సరఫరాను బయోమెట్రిక్ పేరిట గత కొంత కాలంగా ఐసిడిఎస్ అధికారులు నిలిపివేశారు. దీంతో గిరిజన బిడ్డలకు పౌష్టికాహారమైన పాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో ఆదివాసీ చిన్నారులు , బాలింతలు , గర్భిణిలు ఇబ్బందులు పడుతున్నారు. పౌష్టికాహార లోపం కారణంగా అనేక మంది చిన్నారులు పలు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. అసలు ఏజెన్సీలో బయోమెట్రిక్ మూలంగా అంగన్వాడీలకు పాలు సరఫరా ఆగిపోయిందా…? లేక ఇటీవల అంగన్వాడీ పాలను అనుమతి లేకుండా అద్దె ఇండ్లలో నిల్వ ఉంచడం , పాల గోడౌన్ నుండి పాలను ఒరిస్సాకు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ ను తొలగింపు చర్యల్లో భాగంగా పాల సరఫరా నిలిచిపోయిందా…? అనేది ఐసిడిఎస్ అధికారులు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత నెలలో అద్దె గృహాల్లో పట్టుబడిన మరియు ఒరిస్సాకు అక్రమంగా తరలిస్తున్న పాల స్టాక్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేసి తదనంతరం ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు. అయితే ఇద్దరు ఐసిడిఎస్ సీడిపిఓలు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలు అంటూ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ గుండాల కాలనీకి చెందిన సరఫరాదారుడు యొక్క వాహనాలను , సిబ్బందిని ఉపయోగించే సూపర్ వైజర్ల పర్యవేక్షణలో కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు బయోమెట్రిక్ లేకుండా పాలను సరఫరా చేశారు. అటు తర్వాత అంగన్వాడీలకు పాలు సరఫరా చేసేందుకు గతంలో పాలు సరఫరా చేసిన వ్యక్తికి అవకాశం లేనందున వేరొక కాంట్రాక్టర్ ను నూతనంగా నియమించాల్సిన బాధ్యత జిల్లా కాంట్రాక్టర్ ద్వారా ఐసిడిఎస్ అధికారులకు ఉంది. ఈ నేపథ్యంలో గత కాంట్రాక్టర్ మరియు సరఫరాదారుడుపై గతంలో అనేక ఆరోపణలు రావడంతో వారిని తొలగించాలని ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్టు ఇద్దరు సీడిపిఓలు సైతం మీడియాకు తెలిపారు. ఒకవేళ గత కాంట్రాక్టర్ ను తొలగిస్తే ప్రస్తుత పాల సరఫరాకు తన గోడౌన్ మరియు సిబ్బందిని , వాహనాలను మరలా ఐసిడిఎస్ శాఖ ఉపయోగించకూడదనే నిబంధనలు ఉన్నాయి. కాబట్టి అర్హులైన వేరొకరికి పాలు సరఫరా చేసే అవకాశం అధికారులు కల్పించాలి. కానీ ఇంతవరకు అది జరగలేదు. కొంతకాలంగా అంగన్వాడీలకు పౌష్టికాహారమైన పాలు సరఫరా నిలిచిపోయినా కూడా జిల్లా కాంట్రాక్టర్ పై ఉన్నతాధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని స్పష్టం అవుతోంది. క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలను పాలు సరఫరా విషయమై వివరణ కోరినా సరైన సమాధానం రావడం లేదు. దీంతో పాల సరఫరా కాంట్రాక్టు వేరొకరికి ఇస్తే తప్ప సమస్య తీరేట్టు లేదు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఇందుకోసం ఇప్పటికే ఏజెన్సీలో పెద్దఎత్తున రాజకీయంగా పావులు కదుపుతున్నట్టు , గత కాంట్రాక్టర్ మరియు సరఫరాదారుడు సైతం బినామీలను ఏర్పాటు చేసి మరలా కాంట్రాక్టు తానే పొందాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. ఏదిఏమైనా ఈ సమస్య ఏజెన్సీ పరిధిలోనిది కనుక రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి.ధనలక్ష్మి మరియు చింతూరు ఐటిడిఏ పిఓ ఆకుల.వెంకటరమణ ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపడితే తప్పా ఒక దారికి రాదనేది గిరిజన మరియు ప్రజా సంఘాల వాదన. అందువల్ల ఎమ్మెల్యే గారో, పిఓ సారో కాస్తా ఇటు చూడరూ…? అర్హులైన వారికి పాలు సరఫరా కాంట్రాక్టు అవకాశం కల్పించి ఆదివాసీ బిడ్డలకు పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టరూ…!

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు