శ్రీకాకుళం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
సార్వత్రిక పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 31న జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పోలియో వాక్సిన్ పంపిణీ కార్యక్రమాలను శుక్ర వారం పరిశీలించారు. 31వ తేదీన జిల్లాలో ఏర్పాటు చేసిన 1,616 బూత్ లలో పోలియో కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 1,2 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పరిశీలిస్తారని తెలిపారు. జిల్లాలో 0 నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులు 2,33,683 మంది ఉన్నారని చెప్పారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షణకు 158 సూపర్ వైజర్లు, 83 మొబైల్ టీమ్ లు, 50 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేసామని వివరించారు. జిల్లాలో 275 హై రిస్క్ ప్రాంతాలు ఉన్నాయని, అచ్చట 20,608 కుటుంబాలు ఉండగా 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు 7,344 మంది ఉన్నారని చెప్పారు. చిన్నారులను తీసుకు వచ్చే తల్లిదండ్రులు కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు తదితరులు పాల్గొన్నారు.