11:58 PM, 1 Monday March 2021

50,910 రేషన్ కార్డులు రద్దు..!

● ఈకేవైసీతో అనుసంధాన ఫలితం
● ఈ నెల నుంచే సరకుల నిలిపివేత

వెబ్‌డెస్క్ :

గత సర్కారు హయాంలో ఉన్న కార్డుల స్థానంలో బియ్యం కార్డులను వైఎస్సార్‌ నవశకం కింద ప్రస్తుత ప్రభుత్వం విడతల వారీగా మంజూరు చేసింది. వాటి వివరాలను సదరు గ్రామ, వార్డు వాలంటీర్లు ఈకేవైసీకి అనుసంధానం చేయడంతో అనర్హుల చేతిలో ఉన్న 50,910 కార్డులు రద్దయ్యాయి. దాంతో వాటికి ఈ నెల కోటా సరకులు పంపిణీ కూడా నిలిచిపోయింది.

ఒంగోలు: వైకాపా అధికారంలోకి వచ్చాక అనర్హుల చేతిలో ఉన్న బియ్యం కార్డుల ఏరివేతకు గత ఏడాది ఆగస్టులోనే శ్రీకారం చుట్టింది. ప్రతి కార్డుదారుడి కుటుంబ సభ్యుల వివరాలను ఈకేవైసీలో నమోదు తప్పనిసరి చేసింది.

దీంతో ఎక్కడ కార్డులు రద్దవుతాయేమోనన్న ఆందోళనతో అప్పట్లోనే ఎక్కువ శాతం కుటుంబాలు ఈకేవైసీ చేయించాయి. ఆధార్‌ అనుసంధానం ద్వారా అప్పటికే కార్డులోని కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారు లేదా నాలుగు చక్రాల వాహనం, ఆదాయ పన్ను చెల్లించడం, పరిమితికి మంచి విద్యుత్తు బిల్లు, ఇంటి పన్ను చెల్లించడం, మూడెకరాలకన్నా ఎక్కువ మాగాణి కలిగి ఉన్న వారిని గుర్తింపజేసింది. ఆ తర్వాత వైఎస్సార్‌ నవశకం, బియ్యం కార్డుల మ్యాపింగ్‌, ఇతర శాఖలకు కుటుంబ సభ్యుల ఆధార్‌ నంబరు అనుసంధానింపజేసి అనర్హుల చేతిలో ఉన్న వాటి లెక్క తేల్చింది.

* నవంబరు వరకు రేషన్‌ పొందిన కార్డులు: 10,25,455
* డిసెంబరు కోటా పొందినవి: 9,74,545
* రద్దయినవి: 50,910
* వాలంటీర్లు మ్యాపింగ్‌ పూర్తి చేసిన బియ్యం కార్డులు: 8,98,310

లాక్‌డౌన్‌లో తొలగించకుండా…
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉచిత రేషన్‌ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద కుటుంబాలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కార్డులను రద్దు చేయలేదు. ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ప్రతి నెలా రెండుసార్లు బియ్యంతోపాటు కందిపప్పు లేదా శనగలను ఉచితంగా అందజేశాయి. ఆరంచెల తనిఖీలో పొరపాటుగా అర్హత ఉన్న వారి కార్డు తొలగింపు జాబితాలో ఉంటే పరిశీలించి పునరుద్ధరించ నున్నారు. వైఎస్సార్‌ పింఛను కానుక తరహాలోనే ఇంటింటా రేషన్‌ పంపిణీలో వాలంటీరు బయోమెట్రిక్‌ పరికరంలో లబ్ధిదారుని వేలిముద్ర సేకరించిన తర్వాత అతని చరవాణి నంబరుకు ఓటీపీ నంబరు వస్తుంది. దానిని వాలంటీర్ల తన చరవాణిలో నమోదు చేసిన తర్వాతే సరకులు ఇవ్వనున్నారు. అయితే ఈ విధానం అందరికీ వర్తింపజేస్తారా? లేదా వేలిముద్ర పడని వృద్ధులకు అమలు చేయనున్నారా అనే స్పష్టత పౌరసరఫరాల శాఖ నుంచి రావాల్సివుంది.

అర్హతలు ఇవే…
* గ్రామీణ కుటుంబం నెలసరి ఆదాయం: రూ.10 వేలు
* పట్టణాల్లో దాటకూడని మొత్తం: రూ.12 వేలు
* కుటుంబ సభ్యులు ఆదాయ పన్నుదారులై ఉండరాదు
* నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు
* విద్యుత్తు వినియోగం ఆరు నెలలకు 1800 యూనిట్లలోపు అంటే నెలకు 300 దాటకూడదు
* పట్టణ ప్రాంతాల్లో ఇల్లు 1,000 చదరపు అడుగులలోపు ఉండాలి
* మూడెకరాల కన్నా ఎక్కువ మాగాణి లేదా పదెకరాలకంటే ఎక్కువ మెట్ట ఉండరాదు.

పునరుద్ధరణకు అవకాశం
డిసెంబరు కోటా కింద కేవలం బియ్యం కార్డుదారులకు మాత్రమే సరకులు ఇస్తారు. గత నెల వరకు వాటిని తీసుకుని ఈసారి ఆగిపోయిన కార్డుల్లో ఎవరైనా అర్హులుంటే పునరుద్ధరించుకోవచ్ఛు రిమార్కులకు సంబంధించిన పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్‌లోడ్‌ చేయించుకోవడం ద్వారా అర్హత ఉంటే మళ్లీ సరకులు కేటాయిస్తారు. – పి.సురేష్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#