VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 10:17 am Posted by : BOMMU DURGARAO

రామచంద్రపురం గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

రామచంద్రపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో నవంబర్ 14వ తేదీన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్. రాజు జ్యోతి ప్రజ్వలన చేసి, జవహర్‌లాల్ నెహ్రూ, అయ్యంకి వెంకట రమణయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి వారోత్సవాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా కె.వి.ఆర్.ఆర్. రాజు మాట్లాడుతూ గ్రంథాలయాలు ప్రజలందరికీ ఉపయోగపడే దేవాలయాలని పేర్కొన్నారు. కంప్యూటర్ ద్వారా పుస్తకాలు చదవడం కంటే గ్రంథాలయానికి వచ్చి నచ్చిన పుస్తకాలను నేరుగా చదవడం వల్ల మానసిక వికాసం కలుగుతుందని తెలిపారు. బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.మండల విద్యాశాఖాధికారి ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు క్రమం తప్పకుండా గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామచంద్రపురం శాఖా మేనేజర్ ఎం. ఆనంద్ ప్రశాంత్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజూ కాకపోయినా వారానికి కనీసం ఒకసారైనా గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించుకోవాలని అన్నారు. జిల్లా న్యాయస్థాన న్యాయవాది డి. సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు నైతిక విలువలతో కూడిన విద్యను అలవరచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు మూడు విభాగాల్లో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. సబ్ జూనియర్ విభాగంలో ‘మీకు నచ్చిన చిత్రం’, జూనియర్ విభాగంలో ‘చెట్ల పరిరక్షణ’, సీనియర్ విభాగంలో ‘మన పండుగలు’ అనే అంశాలపై పోటీలు నిర్వహించగా సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.