VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 7:27 pm Posted By : VISWAM VOICE DAILY

60 మంది కూలీల పేరిట రూ. లక్షల దోపిడీకి కుట్ర …!

  • మండపం ఊర చెరువులో పని చేయకుండానే హాజరు
  •  ఈ చెరువులో పనులు చేయడం లేదని ముందస్తు ప్రకటన
  •  నమ్మించి వంచించి రహస్యంగా మోసానికి తెర లేపారు
  •  మొదటి వారం 60 మంది కూలీల పేరిట నకిలీ మస్తర్లు
  •  రెండో వారంలోనూ శనివారం వరకూ హాజరు నమోదు
  •  నిలదీస్తే నమాదు కాని పొరపాటు సర్దుబాటుకని వివరణ
  •  స్థానిక “దేశం” నాయకుడి జేబు నింపేందుకే న్నాగం
  •  జనసేన నీలదీతతో పారని అధికారుల 50 : 50 పధకం

శంఖవరం, విశ్వం వాయిస్ న్యూస్ ;

గ్రామాల్లో కూలి పనులు లేక కుటుంబం పూట గడవక పొట్ట పోషణ కోసం దూరప్రాంతాలకు కూలీలు వలస పోవడాన్ని నిరోధించి, ఇటువంటి బడుగు జీవుల కుటుంబాలకు సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటైనా పనులను చెప్పి ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పధకం రాష్ట్రంలో అధికార పార్టీల చోటా, మోటా నాయకుల జేబులు నింపే దళారీలుగా ఉపాధిహామీ పధకం సిబ్బంది మారి పోయారు. గ్రామంలో అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ, వారికి ఇష్టులైన కూలీలకు మాత్రమే పనులు చెబుతూ, అసలు పనులు చేయకుండానే చేసినట్టు నకిలీ మస్తర్లు వేసి, ఆ సొమ్ములను సదరు నాయకుల జేబులను నింపుతూ నిర్లజ్జగా బానిసల అవతారం ఎత్తారు. దీనికి చక్కని ఉదాహరణ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం అవినీతి భాగోతం.

మండపంలో సోమవారం ఏప్రిల్ 27 నుంచి ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ మే నెలలో ఊర చెరువు (వర్క్ ఐడి 0204009014/డబ్ల్యు.హెచ్.99990052 61455), రాజన్నదొర చెరువు (వర్క్ ఐడి 62822), కట్టు గట్టు చెరువు (వర్క్ ఐడి 61490) ల్లో ప్రస్తుతం కాంప్రహెన్సివ్ రెస్టోరేషన్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్ టేంక్స్ పథకంలో ఉపాధి హామీ పనులను చేస్తున్నట్టు అంతర్జాల దస్త్రాలు వెల్లడిస్తున్నాయి. కానీ నిజానికి రాజన్న

దొర చెరువు, కట్టు గట్టు.. ఈ రెండు చెరువుల్లోనే పనులు జరుగు తున్నాయి.‌ ఇక మూడోది ఊర చెరువులో అస్సలు పనులు జరగడం లేదు. ఇంకా ప్రారంభం కాలేదు. మూడు చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరైనప్పటికీ ఊర చెరువులో పనులు చేయమని గ్రామంలో మూడు వారాల క్రితమే‌ సీనియర్ మేట్ నక్కా వ్యాపారయ్య ప్రకటించేసాడు. దీంతో మూడింట రెండు చెరువుల్లోనైనా పని దొరికింది కదా… ఊర చెరువు పనొచ్చాక చూసుకుందాంలే నని ఆ రెండు చెరువుల్లోనే పని చేసుకుంటూ సంతృప్తి పడుతున్నారు. సరిగ్గా ఇదే అదనులో… కూలీల ఆదమరపు వెనుక పెద్ద అవినీతి కుట్రకు తెరతీశారు.‌ అందుకు నమ్మకమైన 60 మంది నకిలీ కూలీలను ఎంపిక చేసుకున్నారు.‌ ఊర చెరువులో పనులు చేయకుండానే చేసినట్టు నకిలీ మస్తర్లు వేసి నకిలీ కూలీల పేరిట విడుదలైన సొమ్మును 50:50 (సగం మీకు, సగం మాకు) పద్ధతిన పంచుకునేందుకు వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విధంగా లక్షలాది రూపాయలను స్వాహా చేసేందుకు గ్రామంపై ఆధిపత్యం చెలాయిస్తున్న”దేశం” పార్టీ నాయకుడు, ఉపాధి హామీ పథకం క్షేత్ర, కార్యాలయం సిబ్బంది పన్నాగం పన్నారు.

అనుకున్నది అనుకున్నట్లుగా అమలు జరిపేస్తూ ఉన్నారు. మిగతా రెండు చెరువుల కూలీలు, దారిన పోయే వారి ఫొటోలను తీసి వాటిని ఊర చెరువు కూలీల ఖాతాకు జత చేసేస్తున్నారు. మొదటి వారంగా మే నెలలో సోమవారం 4 తేదీ నుంచి శనివారం వరకూ పనులను చేసినట్లు నకిలీ కూలీల పేరున మస్తర్లు వేసి ఛాయా చిత్రాలను అంతర్జాలంలో నమోదు చేసారు. ఈ వారానికి వీరికి చెల్లింపులు చేయాల్సిన కూలి సొమ్ముల మొత్తాలను నమోదుచేసి పేమెంట్ ఆర్డర్లను కంప్యూటర్లో అప్ లోడ్ చేశారు.‌ రెండో వారంగా సోమవారం మే 11 తేదీ నుంచి 16 తేదీ శనివారం వరకూ కూడా నకిలీ మస్తర్లను నమోదు చేశారు. ఇలా 60 మంది కూలీలకు రోజుకు రూ. 200 ల చొప్పున చూసుకున్నా వారానికి రూ.72,000 అవుతోంది. రెండు వారాలకూ కలిపి రూ. 1,44,000 అవుతోంది. రెండో వారం శుక్రవారం వరకూ అంతా సవ్యంగానే జరిగింది. శనివారం ఉదయం స్థానిక జనసేన పార్టీ నాయకులు, పోలం బ్రదర్స్ పోలం వెంకటరత్నం, పోలం విష్ణుమూర్తి (పద్మ) ఈ దోపిడీని మీడియా, గ్రామ ప్రజల సమక్షంలో బట్టబయలు చేసేశారు. అంతే కాకుండా ఊర చెరువుకు చేరుకున్న ఉపాధి హామీ పథకం ఏపిఓ. ఎన్.వి.విఎస్. శ్రీనివాసరావు, టెక్నికల్ అసిస్టెంట్ (టిఏ) వింజమళ్ళ సతీష్ ను నిలదీశారు. ఎంపీడీవో యు.నాగేంద్రకు ఫిర్యాదు చేశారు. దీంతో ఊర చెరువులో రెండు వారాల మస్తర్లను కంప్యూటర్ నుంచి తొలగించి, కూలీలకు నగదు బదిలీ కాకుండా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో స్థానిక “దేశం” నాయకుడు, ఉపాధి హామీ పథకం సిబ్బంది పన్నాగం బెడిసి కొట్టినట్లైంది.