raghava.si1@gmail.com
May 8, 2026
అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా…

ఆరోపణలు నిజమని నిరూపిస్తే,ఆస్తులన్నీ ఇచ్చేస్తా.. లేదంటే వారి ఆస్తులు అప్పగిస్తారా.?

ఇళ్ల స్థలాల అవినీతిపై మాజీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే నల్లమిల్లి సవాల్..

అనపర్తి, విశ్వంవాయిస్ న్యూస్:

అనపర్తి నియోజకవర్గంలోని ఇళ్లపల్లి, రంగాపురం గ్రామాల్లో జలజీవన్ మిషన్ పథకం ద్వారా నిర్మించబోయే వాటర్ ట్యాంకులకు గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో ఇళ్ల స్థలాల పంపిణీ, భూసేకరణలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన ఆయన, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో రాష్ట్రవ్యాప్తంగా రూ.1100 కోట్ల అవినీతి బయటపడిందన్నారు. ఇప్పటికే భూసేకరణలో రూ.15 కోట్ల అవినీతి నిర్ధారణ అయ్యిందని, మొత్తం స్కాం రూ.30 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఆలీబాబా అరడజను దొంగలు సామెతలా అవినీతిలో పాత్ర ఉన్న వారినే పక్కన పెట్టుకుని ప్రెస్‌మీట్ పెట్టడం విడ్డూరమని మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. అవినీతి వ్యవహారాల్లో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదికలో సిఫారసు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వ కాలంలో కేంద్రం ఇచ్చిన జలజీవన్ మిషన్ నిధులను సద్వినియోగం చేయలేదని, అప్పట్లో నిర్మించిన రోడ్లను సైతం తవ్వేసి గ్రామాలను అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. ప్రస్తుతం తాము పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. తన కుమార్తె వివాహంలో రూ.100 కోట్ల కట్నం తీసుకున్నారన్న ప్రచారాన్ని కొట్టిపారేస్తూ, తమ కుటుంబాల మధ్య డబ్బు ప్రస్తావనే రాలేదఅని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే తన ఆస్తులన్నీ ఇచ్చేస్తానని, లేదంటే వారి ఆస్తులు తనకు అప్పగించాలంటూ బహిరంగ సవాల్ విసిరారు. దేవాలయ భూముల విషయంలోనూ చట్టాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకే అప్పట్లో భూములను ఇళ్ల స్థలాల కోసం వినియోగించామని పేర్కొన్నారు. నేను అవినీతి చేశానని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. కానీ మీపై జరిగిన విచారణలో ఇప్పటికే కోట్ల రూపాయల అవినీతి తేలింది అంటూ మాజీ ఎమ్మెల్యేపై ఎమ్మెల్యే నల్లమిల్లి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Share to WhatsApp Download Image Download PDF Back to Read Article