వెంటూరులో మంచినీటి కష్టాలు.. నెల రోజులుగా తప్పని తిప్పలు
వేసవి మంటల్లో మంచినీటి ఎద్దడి.. మూలనపడ్డ చేతి పంపులు
కలుషిత నీటతోనే కాలనీవాసుల ఆవేదన..
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:

మండుటెండలు ముదురుతున్న వేళ… తూర్పుగోదావరి జిల్లా, రాయవరం మండలం, వెంటూరు గ్రామంలోని శ్రీరామ నగర్ కాలనీ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకవైపు భానుడి భగభగలు మండుతుండగా, మరోవైపు చుక్క మంచినీటి కోసం కాలనీవాసులు కటకటలాడుతున్నారు. నెలరోజులుగా కొనసాగుతున్న నీటి కష్టాలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. గతంలో రోజంతా అందుబాటులో ఉండే తాగునీరు ఇప్పుడు “టైమ్ స్లాట్”కే పరిమితమైంది. ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలే నీటి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు గడియారం చూసుకుంటూ బకెట్లు పట్టుకుని క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. “నీళ్లు రావాలంటే సమయం చూసుకోవాలి” అన్న పరిస్థితి ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే సమయంలో కాలనీకి ఆధారంగా ఉన్న నాలుగు చేతి పంపులు నెలలుగా పనిచేయక మూలనపడి ఉన్నాయి. ప్రత్యామ్నాయం లేక ట్యాంక్ ద్వారా వచ్చే నీటిపైనే ఆధారపడాల్సి వస్తున్నా, పైపుల లీకేజీల కారణంగా కలుషిత నీరు వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఆ నీరు తాగడానికి మాత్రమే కాదు, వాడుకోవడానికి కూడా పనికిరాకపోవడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండుటెండల్లో కనీసం తాగునీరు కూడా అందించలేకపోవడం బాధాకరమని విమర్శిస్తున్నారు. “ఇప్పటికే ఆసుపత్రుల్లో మందులు లేవు, ఇంధన కొరత ఉంది… ఇప్పుడు నీళ్లు కూడా దొరకవా?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు

తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటం చాలా బాధాకరం.
వెంటూరు గ్రామంలోని శ్రీరామ నగర్ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటం చాలా బాధాకరం. మండుటెండల్లో ప్రజలు చుక్క నీటి కోసం ఇబ్బంది పడటం దురదృష్టకరం. నెల రోజులుగా సమస్య కొనసాగుతున్నా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. పనిచేయని చేతి పంపులను వెంటనే మరమ్మతు చేసి, పైపుల లీకేజీలను సరిచేసి పరిశుభ్రమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాత్కాలికంగా నీటిని సరఫరా చేయాలి. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ సమస్య పై చర్యలు చేపట్టాలి.
మేడిశెట్టి సాయి శ్రీనివాసరావు
వెంటూరు, శ్రీరామ నగర్ కాలనీ వాసి.

ప్రజలకు ప్రత్యామ్నాయంగా తాగునీరు అందుబాటులో ఉంచేలా చూస్తాం
గతంలో రోజంతా వాటర్ ట్యాంక్ ద్వారా తాగునీటి సరఫరా చేసేవాళ్లం. అయితే ఇటీవల మోటార్ రిపేర్ తరచుగా రావడంతో, ప్రస్తుతం ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలపాటు మాత్రమే నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించాం. రిపేర్ లో ఉన్న చేతిపంపులను వెంటనే మరమ్మతులు చేయించి, ప్రజలకు ప్రత్యామ్నాయంగా తాగునీరు అందుబాటులో ఉంచేలా చూస్తాం. అదేవిధంగా భవిష్యత్తులో తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా శాశ్వత పరిష్కారాలపై కూడా దృష్టి పెట్టుతున్నాం.
నరవ త్రిమూర్తులు
వెంటూరు, గ్రామపంచాయతీ కార్యదర్శి
