VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 10:50 pm Posted by : khandavelli567@gmail.com

నగల షాప్ చోరీ కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష

కాకినాడ, ఆగస్టు 14, విశ్వం వాయిస్ క్రైమ్ న్యూస్:, Kakinada (VISWAM VOICE DESK):

కాకినాడ నగరంలోని ప్రముఖ నగల దుకాణంలో తుపాకీతో బెదిరించి బంగారు ఆభరణాలు అపహరించిన కేసులో నిందితుడికి ఏడాది సాధారణ జైలు శిక్ష పడింది. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా చేసిన కాకినాడ వన్‌టౌన్ పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటారు.

కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 296/2024, బీఎన్‌ఎస్ సెక్షన్ 309(4) కేసులో కాకినాడ III అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శ్రీమతి డి. శ్రీదేవి శుక్రవారం తీర్పు వెలువరించారు. నిందితుడు నూకల సతీష్ (26), తండ్రి చక్రధరరావు, కందికుప్ప గ్రామం, కాట్రేనికోన మండలం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాను దోషిగా నిర్ధారించి ఏడాది సాధారణ జైలు శిక్ష విధించారు.

తుపాకీతో బెదిరించి నగలు అపహరణ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2024 డిసెంబర్ 18న మధ్యాహ్నం సుమారు 3.15 గంటలకు కాకినాడ టెంపుల్ స్ట్రీట్‌లోని తానిష్క్ జ్యువెలర్స్‌కు నూకల సతీష్ వెళ్లాడు. సేల్స్‌మ్యాన్ గంటశాల సుబ్రహ్మణ్యాన్ని బంగారు గొలుసులు, నాణేలు చూపించమని కోరాడు. ఆభరణాలు పరిశీలిస్తున్న సమయంలో తుపాకీ చూపించి బెదిరించి ఆరు బంగారు గొలుసులు, రెండు బంగారు నాణేలను అపహరించాడు.

మొత్తం 39 గ్రాముల బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.1.95 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా షాపు సిబ్బంది అతడిని వెంబడించి కాకినాడ ఫారెస్ట్ కార్యాలయం సమీపంలో పట్టుకున్నారు. నిందితుడి నుంచి చోరీ సొత్తుతో పాటు తుపాకీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్ర వాహనం (ఏపీ 37 డీవీ 0234)ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.

పకడ్బందీ దర్యాప్తుతో శిక్ష

కేసులో దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు నిందితుడిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అనంతరం కోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫున ఏపీపీ శ్రీమతి కె. సుధారాణి వాదనలు వినిపించారు. కేసు ట్రయల్ ప్రక్రియను కాకినాడ వన్‌టౌన్ సీఐ ఎం. నాగదుర్గారావు పర్యవేక్షించారు.

ట్రయల్ కేసుల్లో ప్రత్యేక దృష్టి సారిస్తూ నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు కేసును పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లారు. కాకినాడ ఇన్‌చార్జి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, కాకినాడ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ పర్యవేక్షణ కూడా కేసు విజయవంతంగా ముగియడంలో కీలకంగా నిలిచింది.

కేసు ట్రయల్‌కు సహకరించిన కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఎన్. సత్యనారాయణ, వన్‌టౌన్ సీఐ ఎం. నాగదుర్గారావులను జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ప్రత్యేకంగా అభినందించారు.