08:44 AM, 26 Friday February 2021

అంతుపట్టని వ్యాధి ఏలూరును వణికిస్తోంది

ప.గో.జిల్లా, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒక వీధి కాదు.. రెండు వీధులు కాదు.. సరికొత్త మహమ్మారిబారినపడి నగరానికి చెందిన వందలాదిమంది ఆస్పత్రిపాలవుతున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అసలేంజరుగుతుందో తెలియని పరిస్థితిలో నగరవాసులు ఉంటే.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్రభుత్వం కొట్టిమిట్టాడుతోంది. కొందరు నడుస్తూనే కుప్పకూలిపోతున్నారు. ఇంకొందరు మూర్ఛ పోతున్నారు.. మరికొందరు నోటి నుంచి నురగలు కక్కుతూ పడిపోతున్నారు. తమవారికి వచ్చిన వ్యాధి ఏంటో తెలియక వారి బంధువులు భయాందోళనకు గురౌతున్నారు. సాక్ష్యాత్తు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఇలాకాలో పరిస్థితి ఇలా ఉంది.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆస్పత్రికి వచ్చిన 270 మందికి కోవిడ్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటీవ్ వచ్చినట్లు వైద్యులు ధృవీకరించారు. పదేళ్లలోపు చిన్నారులు కొందరు హఠాత్తుగా ఫిట్స్ వచ్చి కుప్పకూలడం లాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి.

తొలుత ఒక వీధికే పరిమితమైన వ్యాధి క్రమంగా విస్తరించడం భయాందోళన రేపుతోంది. ఐదురోజుల క్రితమే నగరంలోని దక్షిణపు వీధికి చెందిన కొందరిలో ఫిట్స్‌ లక్షణాలు కన్పించాయి. వీరంతా చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించారు. రోగ నిర్ధారణ కాకపోవడంతో అందరూ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటూ అక్కడి వైద్యులు సూచించారు. అప్పటినుంచి ఆదివారం రాత్రి నాటికి 300 మందికి పైగా చికిత్స కోసం ఆస్పత్రి బాట పట్టారు. సాధారణంగా ఈ ప్రాంతంలో నీటి కాలుష్యం కారణంగానే ఏడాది పొడవునా ఎంతో కొంతమంది డయేరియా బారిన పడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడీ వ్యాధి అందరికీ పెద్ద పజిల్‌గా మారింది. వ్యాధి లక్షణాలు, రోగి తీరుతెన్నులను క్షుణ్నంగా పరిశీలించినా వైద్యనిపుణులు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఒకరిద్దరు మాత్రం మాస్‌ హిస్టీరియా అని తేల్చేస్తున్నారు. మరికొందరు మెదడు వాపు వ్యాధి అంటున్నారు. తాజా పరిస్థితికి అధికార పక్షం అంతుపట్టని వ్యాధిగా నామకరణం చేసింది.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#