RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండటం ద్వారా ప్రమాద తీవ్రతను, ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని రామచంద్రపురం అగ్నిమాపక శాఖ అధికారి కే. వెంకటరెడ్డి తెలిపారు.స్థానిక భాష్యం పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి కే. వెంకటరెడ్డి విద్యార్థులకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఆందోళనకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకున్న సందర్భంలో వాటిని ఎలా అదుపు చేయాలో ఆయన ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించారు. అనంతరం విద్యార్థులతో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌ను ఉపయోగించి మంటలను ఎలా అదుపు చేయాలో ప్రాక్టికల్‌గా చేయించారు.అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ ఐ.వీ. సుబ్రహ్మణ్యం విద్యార్థులకు ప్రాథమిక రక్షణ చర్యలు, రెస్క్యూ పద్ధతులపై అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగినప్పుడు తమను తాము సురక్షితంగా కాపాడుకోవడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో ఇతరులను ఎలా సురక్షితంగా బయటకు తీసుకురావాలి, రెస్క్యూ బృందంగా ఎలా పనిచేయాలి అనే అంశాలను వివరించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పి. భాస్కరరావు మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ముందస్తు జాగ్రత్తలు, సరైన సమయంలో తీసుకునే చర్యల ద్వారా ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌ను ఎలా ఉపయోగించాలి, మంటలను ఎలా అదుపు చేయాలి అనే విషయాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. పలువురు విద్యార్థులు స్వయంగా ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌ను ఉపయోగించి ప్రదర్శనలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించడం, భద్రతా చర్యలను పాటించడం వంటి అంశాలపై విద్యార్థుల్లో ఈ కార్యక్రమం ద్వారా మంచి అవగాహన ఏర్పడింది