RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నవంబర్ 13న పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. చిట్టిబాబు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు, ముఖ్యంగా యువతులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాదులు రామచంద్రరావు, పి.వి.ఎస్. జానకి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడం, బాలల హక్కులను పరిరక్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2012లో పోక్సో చట్టాన్ని తీసుకొచ్చిందని వివరించారు. బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. న్యాయవాది పి.వి.ఎస్. జానకి మాట్లాడుతూ బాలికలు తమపై జరిగే వేధింపుల విషయంలో భయపడకుండా ధైర్యంగా బయటకు చెప్పాలని, మౌనంగా ఉండకూడదని సూచించారు. బాధిత బాలలకు పోక్సో చట్టం ద్వారా చట్టపరమైన రక్షణ లభిస్తుందని వివరించారు.రాజనీతి శాస్త్ర విభాగ అధ్యాపకులు కే. రవిబాబు, డాక్టర్ ఎన్. సుజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, సమాజంలో జరిగే అన్యాయాలపై బాధ్యతాయుతంగా స్పందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జి. దుర్గారావు, జె. రాజేష్, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందితో పాటు సుమారు 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు.