దాతల చేయూత కోసం ఎదురుచూపులు
రాయవరం,విశ్వంవాయిస్ న్యూస్:
వయసు చిన్నది… కానీ ఎదురైన సమస్య మాత్రం చాలా పెద్దది. తూర్పుగోదావరి జిల్లా, మండల కేంద్రమైన రాయవరం గ్రామానికి చెందిన నేతల రామారావు (రాంబాబు), సంధ్యాదేవి దంపతుల కుమారుడు యశ్వంత్ సాత్విక్ (4) పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యుల పరీక్షల్లో చిన్నారికి అత్యవసరంగా గుండె శస్త్రచికిత్స అవసరమని తేలగా తొలుత చికిత్సకు రూ.6.15 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు అంచనా వేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండవిల్లి రాంబాబు చొరవ తీసుకుని మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సుమారు రూ.3 లక్షల ఆర్థిక సాయం ఆసుపత్రి ఖాతాకు చేరేలా చర్యలు తీసుకున్నారు.

అయినప్పటికీ మిగిలిన చికిత్స ఖర్చు ఆ కుటుంబానికి భారంగా మారింది ఆ మొత్తాన్ని సమకూర్చుకునే స్థోమత కుటుంబానికి లేదు. రామారావు (రాంబాబు) స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సాధారణ ఆదాయంతో కుటుంబ అవసరాలు తీర్చుకోవడమే కష్టంగా ఉండటంతో, చిన్నారి చికిత్స ఖర్చులను భరించడం వారికి మరింత భారంగా మారింది. ఈ నేపథ్యంలో చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఒక చిన్న సహాయం కూడా ఆ చిన్నారి జీవితంలో కొత్త వెలుగులు నింపగలదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సహాయం చేయాలనుకునే వారు చిన్నారి తండ్రి నేతల రామారావు (రాంబాబు)ను 9642772357 నంబర్‌లో సంప్రదించి తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నారు.

చిన్నారి చిరునవ్వును కాపాడేందుకు మనం చేయూతనిద్దాం… మన చిన్న సహాయం ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు.