అవును.. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు పుష్ప 2 సినిమాపై హడావుడి మొదలెట్టేశారు. ఎవరు అడ్డుకుంటామని అన్నారో తెలియట్లేదు కానీ, ఈయన మాత్రం సినిమా రిలీజ్‌కు ముందే రచ్చ రచ్చ చేసేస్తున్నారు. వాస్తవానికి సోషల్ మీడియా వేదికగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలు వైసీపీ కార్యకర్తలు తెగ పొగడ్తలు కురిపిస్తూ, ఆకాశానికెత్తేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్, ఈవెంట్స్, ఆయన ప్రసంగాన్ని తెగ షేర్ చేస్తూ మాకోసం నిలబడ్డారు.. మీకోసం మేమూ ఏదో ఒకటి చేయాలి కదా అంటూ ఎన్నికల ముందు నంద్యాలకు బన్నీ వచ్చిన విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ గట్టిగానే సపోర్టు చేస్తున్నారు. ఇప్పుడిక ఆ పార్టీ నేతలే ఓపెన్ అయిపోయారు. అంబటి రాంబాబు మీడియా ముఖంగానే మనసులోని మాటను బయటపెట్టేశారు.
ఆపండి చూద్దాం!
అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ ఆపలేరు. అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్. పుష్ప2 అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకోవాలనుకున్నారు ఏమైంది? ఈ మూవీ కూడ అంతే. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. పుష్ప 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేను కూడా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అరచేతిని అడ్డుపెట్టుకుని సినిమా విజయాన్ని ఆపలేరు. నేను కూడా సినిమా చూడటానికి రెడీగా ఉన్నాను. పుష్ప1అద్భుతంగా ఉంది. పుష్ప 2పై కొంతమందికి జెలసీగా ఉంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ను బహిష్కరించాలనుకోవడం అవివేకం అని అంబటి కుండ బద్దలు కొట్టారు.
అరెస్ట్ చేయరేం?
సోషల్‌మీడియాలో పోస్టులపై వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నపుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరు? అని అంబటి ప్రశ్నించారు. వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నారు. ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడితే టీడీపీ వాళ్లను కూడా అరెస్ట్ చేస్తామని చంద్రబాబు నీతి వ్యాక్యాలు చెప్పారు. అయితే వైర్‌సీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం లేవు. ఇప్పటికే ఈ నెల 17,18,19 తేదీల్లో వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మా కుటుంబ సభ్యులపైన టీడీపీ నాయకులు పెట్టిన పోస్టులపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేశాం. డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైన కూడా కేసులు పెట్టారు. పోసాని మురళీకృష్ణ వైఎస్ జగన్ అభిమాని. ఆయనపై కేసులు పెట్టి భయపెట్టొచ్చేమో కానీ వైయస్ జగన్‌పై ఆయనకున్న ప్రేమను మాత్రం తొలగించలేరు. రెడ్‌బుక్ లోకేష్ రాశాడు. రెడ్‌బుక్ లోకేష్‌కు శాపంగా మారుతోంది. రెడ్‌బుక్ రచయితగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతాడు అని అంబటి ఎద్దేవా చేశారు.