కరప, ఆగస్టు 14:, Kakinada (VISWAM VOICE DESK):
ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను అత్యంత పకడ్బందీగా విచారించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోని కరప మండలం చంద్రన్న సమావేశ మందిరంలో శుక్రవారం ‘ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమం రెండో వారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి పి. వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి, నాలుగు శుక్రవారాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ‘ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గత వారం అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, పూర్తి స్థాయి విచారణ చేపట్టి సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు.
రెండో వారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో సుమారు 43 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రధానంగా భూవివాదాలు, రీసర్వేలో తలెత్తిన సమస్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు, రహదారులు, తాగునీటికి సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రతి సమస్యపై అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని, ప్రజల సమస్యలకు అనుకూలమైన పరిష్కారం చూపేలా తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గత వారం, ఈ వారం అందిన అన్ని అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, ప్రజలకు పూర్తి స్థాయి పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో కరప తహసీల్దార్ లక్ష్మీ సరస్వతి, ఎంపీడీవో జె. శ్రీనివాసు, నియోజకవర్గ, డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.