VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 12:01 pm Posted by : shaikansar.ali37@gmail.com

సంపద సృష్టిస్తున్నారా???సంపాదించుకుంటున్నారా???…

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):

కూటమి ప్రభుత్వంపై వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి ఫైర్…

 

నిత్యావసర వస్తువుల ధరల పెంపు.. విద్యుత్‌ ఛార్జీల భారం.పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సామాన్యులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, వైసీపీ సీనియర్ నేత వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి విమర్శించారు. సంపద సృష్టి అంటే ఇదేనా బాబూ? అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 9వ వార్డులో వైసీపీ అభ్యర్థి మందపల్లి శాంతి గెలుపే లక్ష్యంగా ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతీ ఇంటికీ వెళ్ళి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ వార్డు ప్రజలపై తనకు ప్రత్యేకమైన నమ్మకం ఉందన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి అభిమానులుగా ఉన్న వార్డు ప్రజలు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై రెట్టింపు అభిమానం ఈ ప్రాంత ప్రజలకు ఉందన్న విషయం తెలుసన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏ నాటి నుంచో కలలు కంటున్న మీ కోరిక తీరే సమయం రానే వచ్చిందన్నారు. వైసీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రామును, 36 వార్డుల్లో ఉన్న వైసీపీ అభ్యర్థులను సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తిరుగులేని విజయం అందించాలని పిలుపు నిచ్చారు. రామును గెలిపించి మీ చిరకాల వాంఛ నెరవేర్చుకోవాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ప్రకటించిన 20 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు నెలకు రూ 3 వేల భృతి ఇస్తామన్న హామీ అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. టిడ్కో గృహాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ 1500 అందిస్తామని ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటని నిలదీస్తూ మరోసారి కూటమి నాయకులు చెప్పే మోసపూరిత వాగ్దానాలకు మోస పోవద్దని చెప్పారు. మరోవైపు నిత్యావసర వస్తువులు, విద్యుత్‌ ఛార్జీలు, గ్యాస్‌ ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలపై భారం పడుతోందన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా మాయ మాటలతో పబ్బం గడుపుకుంటున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మళ్ళీ కూటమి నాయకుల గారడీలో పడకుండా ఆలోచన చేయాలన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు తమ అసంతృప్తిని ఓటు ద్వారా తెలియజేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, 9వ వార్డు అధ్యక్షుడు సుధాకర్‌రావు, ఉపాధ్యక్షుడు కొమ్ము సూరిబాబు, ఆర్టీఐ విభాగం నాయకుడు కొల్లి సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్‌ కొల్లి వరలక్ష్మి, బూత్‌ కమిటీ అధ్యక్షుడు కొల్లి రవి, ఎస్సీ సెల్‌ నాయకుడు కొల్లి చిన్నారావు, తాతపూడి సురేష్‌, దార్ల అబ్రహం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.